చంద్రబాబు డౌట్: మోత్కుపల్లి ఎవరికి కోవర్టు?

చంద్రబాబు డౌట్: మోత్కుపల్లి ఎవరికి కోవర్టు?

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు చేస్తున్న ఆరోపణల వెనక ఇతర పార్టీల నాయకులున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మోత్కుపల్లి నర్సింహులు జంకూ గొంకు లేకుండా చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీలో ఆయన ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి.

దళితుడు కావడంతో మోత్కుపల్లిని ఎదుర్కోవడం తెలుగుదేశం పార్టీకి కాస్తా కష్టంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ టీడీపి అధ్యక్షుడు ఎల్. రమణ మోత్కుపల్లి ఆరోపణలను తిప్పికొట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. మోత్కుపల్లి ఆరోపణలను తిప్పికొట్టేంత బలం ఆయన వ్యాఖ్యల్లో లేవు. 

మోత్కుపల్లి నర్సింహులు పార్టీ మహానాడుకు పిలువకపోవడం ద్వారా చంద్రబాబు తప్పు చేశారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ఇప్పటికిప్పుడైతే మోత్కుపల్లి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కాంగ్రెసు పార్టీలో చేరడానికి కూడా ఆయన తగిన వెసులుబాటు ఉంటుంది. 

మోత్కుపల్లి నర్సింహులు ఆరోపణల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయనే భావన పార్టీ నాయకుల నుంచే వ్యక్తమవుతోంది. తెలంగాణలో పార్టీ బలంగా ఉందని చంద్రబాబుతో సహా ఇతర తెలంగాణ నాయకులు చెప్పినప్పటికీ అది మాట మాత్రమేనని అనుకునే పరిస్థితి ఉంది. టీడీపి వచ్చే ఎన్నికలనాటికి టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుందనే అభిప్రాయం కూడా ఉంది.

కాగా, మహానాడు జరుగుతున్న సమయంలో మోత్కుపల్లి చంద్రబాబుపై ఆరోపణలు చేయడం వెనక పక్కా వ్యూహం ఉందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ జయంతిని, మహానాడును సందర్భంగా తీసుకుని తాను చెప్పాల్సిన విషయాలను మోత్కుపల్లి చెప్పారని అంటున్నారు. ఆయన వెనక వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గానీ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గానీ ఉండవచ్చునని ఎల్ రమణ వ్యాఖ్యలను బట్టి తెలుగుదేశం అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇద్దరు కూడా ఉండవచ్చుననే సందేహం కూడా ఆ పార్టీకి ఉన్నట్లు అర్థమవుతోంది.

మొత్తం మీద, మోత్కుపల్లి విమర్శలతో తెలుగుదేశం పార్టీ కొంత మేరకు ఆత్మరక్షణలో పడిందనే చెప్పాలి. మోత్కుపల్లి నేరుగా చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేశారు. ఓటుకు నోటు కేసును ప్రస్తావించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వీటిని ఎలా తిప్పికొట్టాలనే సందిగ్ధంలో టీడీపి ఉన్నట్లు చెబుతున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page