తెలుగుదేశం పార్టీ (టిడిపి) చీఫ్ నారా చంద్రబాబునాయుడు తెలంగాణ సెంటిమెంట్ ను రాజేశారు. టిడిపి వచ్చిన తర్వాతనే తెలంగాణ ప్రజల అన్నం తినడం ప్రారంభించారనే పద్ధతితో చంద్రబాబు మాట్లాడారు.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తెలంగాణ సెంటిమెంట్ అగ్గి రాజేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ (టిడిపి) దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ స్థితిలో తిరిగి తెలంగాణలో పార్టీ ఉనికిని చాటాలని ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఆయన ఆదివారం హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్ లో ప్రారంభించారు. 

ఆ కార్యక్రమంలో చంద్రబాబు తెలంగాణ ప్రజల ఆహారపు అలవాట్లపై వ్యాఖ్యలు చేశారు. ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రజలు జొన్నలు, రాగులు లేకపోతే సజ్జలు తినేవారని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రూపాయల కిలో బియ్యం పథకం ప్రారంభించిందని, దాంతో తెలంగాణ ప్రజలు బియ్యం అన్నం తినడం ప్రారంభించారని ఆయన అన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే తెలంగాణ ప్రజలు బియ్యం తినడం ప్రారంభించారనే అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడారు.

వీడియో

చంద్రబాబు వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా చంద్రబాబు వైఖరి టిడిపిని తెలంగాణలో దాదాపుగా నామరూపాలు లేకుండా చేసింది. తెలంగాణకు చెందిన పలువురు టిడిపి నాయకులు బిఆర్ఎస్ లోనూ ఇతర పార్టీల్లోనూ చేరారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టిడిపి నుంచి వచ్చినవారే. 

చంద్రబాబు వ్యాఖ్యలతో తెలంగాణలో టీడిపిని విస్తరించాలని చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు పడిందనే మాట వినిపిస్తోంది. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ విషయంలో చంద్రబాబు అగ్నికి ఆజ్యం పోశారనే మాట వినిపిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నప్పటికీ టిడిపి ఏ మాత్రం ఫలితాలు సాధించలేకపోయింది. చంద్రబాబుతో పొత్తు కారణంగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పాగా వేయలేకపోయిందని, కాంగ్రెస్ నష్టపోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ వస్తున్నారు.