హైదరాబాద్: గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ముందుచూపుతో నిర్ణయాలు తీసుకోవడం వలనే ప్రస్తుతం తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు క్యూ కట్టాయని మాజీ సీఎం, టిడిపి జాతీయాధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటీవల అమెజాన్ సంస్థ కూడా భారీ పెట్టుబడులతో హైదరాబాద్ కు రావడం తమ ప్రభుత్వ చలవేనని చంద్రబాబు అన్నాడు. 

గ్రేటర్ హైదరాబాద్ తెలుగుదేశం నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో తన నేతృత్వంలోని టిడిపి ప్రభుత్వం నగరాన్ని ఎలా అభివృద్ది చేసిందో ప్రజలకు వివరిస్తూ గ్రేటర్ ఎన్నికలకు సిద్దం కావాలని సూచించారు. ఈ నగర అభివృద్దిలో ముఖ్యపాత్ర వహించింది టిడిపి ప్రభుత్వమే కాబట్టి గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి, ప్రజలకు ఓటు అడగడానికి మనకు అన్ని హక్కులు వున్నాయన్నారు. కాబట్టి క్షేత్రస్ధాయిలో అంకితబావం కలిగిన కార్యకర్తలు, మిగతా పార్టీ శ్రేణులను ఉపయోగించుకుని గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం ప్రయత్నించాలని చంద్రబాబు పార్టీ నాయకులుకు సూచించారు. 

read more   మరోసారి అవకాశమిస్తే సైబరాబాద్ లాంటి నగరం నిర్మించేవాళ్లం: ఓటమిపై చంద్రబాబు

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు తాను సీఎంగా వుండగానే భారీ ఐటీ కంపనీలను తీసుకువచ్చి బెంగళూరు వంటి ఐటీ నగరాలతో పోటీపడేలా సైబరాబాద్ ను అభివృద్ది చేసినట్లు చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారు. అలా విభజిత ఆంధ్ర ప్రదేశ్ ను కూడా అభివృద్ది  చేయాలని ప్రయత్నిస్తుండగా అధికారాన్ని కోల్పోయినట్లు ఇటీవల చంద్రబాబు పేర్కొన్నారు.  మరోఐదేళ్లపాటు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా సైబరాబాద్ లాంటి నగరం నిర్మించేవాళ్లమని ఆయన ఇటీవల అభిప్రాయపడ్డాడు.