షర్మిల కాంగ్రెస్‌లో చేరుతారనే వార్తలపై వీహెచ్ స్పందించారు. ఈ వార్తలపై తనకు అవగాహన లేదని, తనకు తెలియదని అన్నారు. అలాగే.. ఆమె తెలంగాణలో కంటే ఏపీలో పని చేయడం బెటర్ అని సూచన చేశారు.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే అంశం తెలంగాణలో సంచలనంగా మారింది. కాంగ్రెస్ అధిష్టానంతో ఆమె టచ్‌లో ఉన్నారని, త్వరలోనే ఢిల్లీకి వెళ్లుతున్నారనే వార్తలూ వచ్చాయి. అంతేకాదు, ఆమె విషయంలో అధిష్టానం కూడా సానుకూలంగా ఉందని తెలిసింది. ఈ వ్యవహారంపై టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, టీ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే విషయం తనకు తెలియనే తెలియదని అన్నారు. ఇదే నిజమైతే మాత్రం.. ఆమె తెలంగాణ కాంగ్రెస్‌లో చేరడం కంటే.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లో చేరడం ప్రయోజనకరం అని వివరించారు.
తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ పార్టీకి వేవ్ స్టార్ట్ అయిందని అన్నారు. ఎవరిని కదిపినా కాంగ్రెస్ గురించే మాట్లాడుతున్నారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లడం కాదు.. హస్తం పార్టీలోకే వలసలు పెరుగుతున్నాయని చెప్పారు.
Also Read: కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనమా? పొత్తు మాత్రమేనా?.. రెండు రోజుల్లో ఢిల్లీకి షర్మిల!
ఇదే సందర్భంలో ఆయన అధికార బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు సంధించారు. ఎన్నికల కోసమే కేసీఆర్ బీసీ బంధు అంటున్నారని పేర్కొన్నారు.
