వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ.. తెలంగాణ కాంగ్రెస్‌లో విలీనం కాబోతున్నదా? లేక పొత్తు వరకే పరిమితం కాబోతున్నదా? అనే చర్చ జరుగుతున్నది. ఇవన్నీ వదంతులే అని కొట్టిపారేసే అవకాశం లేదు. కాంగ్రెస్ అధిష్టానంతో షర్మిల టచ్‌లో ఉన్నారని మాణిక్ రావ్ ఠాక్రే వెల్లడించిన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఆమె ఢిల్లీకి వెళ్లి అక్కడ అగ్ర నేతలతో భేటీ కాబోతున్నట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. 

న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపి విలీనం గురించిన వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్పందించారు. వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల కూడా స్పందించినా స్పష్టత ఇవ్వలేదు. టీపీసీసీలో షర్మిలను చేర్చుకునే ప్రసక్తే లేదని, ఆంధ్ర పాలకుల ఆధిపత్యం నుంచే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్లీ వారికి నాయకత్వంలో చోటు ఇవ్వబోమని రేవంత్ రెడ్డి గతంలోనే స్పష్టం చేశారు. విలీనం వార్తలపై నిన్న షర్మిల స్పందిస్తూ.. తాను తెలంగాణ బిడ్డ అని, చివరి వరకు తెలంగాణ కోషం పోరాడుతానని చెప్పడం గమనార్హం.

కాగా, కాంగ్రెస్ అధిష్టానంతో వైఎస్సార్టీపీ టచ్‌లోనే ఉన్నారని కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జీ మాణిక్ రావ్ ఠాక్రే స్పష్టత ఇవ్వడం చాలా వరకు వదంతులకు బ్రేక్ వేసింది. కానీ, కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనం అవుతుందా? లేక పొత్తు మాత్రమే ఉంటుందా? అనే చర్చ మొదలైంది. ఈ అంశంలో స్పష్టత రావాల్సి ఉన్నది.

కాంగ్రెస్‌తో కలిసి పని చేయడంపై షర్మిల కొన్ని షరతులు పెట్టినట్టు తెలుస్తున్నది. టీపీసీసీలో కీలక బాధ్యతలు ఇవ్వాలని, పాలేరు నుంచి పోటీకి తనకు అనుమతి ఇవ్వాలని ఆమె షరతు పెట్టినట్టు సమాచారం. అలాగే.. తాను కోరిన వారికి సీట్లు కేటాయింపుపైనా హామీని అడిగినట్టు తెలిసింది. తన రాజకీయాలు కేవలం తెలంగాణకే పరిమితం అవుతాయని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోబోనని చెప్పినట్టూ కొందరు నేతలు చెబుతున్నారు.

కాంగ్రెస్‌తో షర్మిల టచ్‌లోనే ఉన్నారని చెప్పిన మాణిక్ రావ్ ఠాక్రే ఏఐసీసీ పెద్దలతో సమావేశం అయ్యారని తెలిసింది. ఆ భేటీలో షర్మిలతో చర్చలు ఆఖరి దశకు చేరుకున్నాయని, అందుకు సంబంధించిన వివరాలను రాహుల్ గాంధీకి తెలియజేసినట్టు కొన్ని వర్గాలు వివరించాయి. ఈ అంశాలపైనా స్పష్టత వచ్చిన తర్వాత కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో షర్మిల సమావేశం అయ్యే అవకాశం ఉన్నదని తెలిపాయి. ఈ నేపథ్యంలోనే షర్మిల మరో రెండు రోజుల్లో ఢిల్లీకి పయనం కాబోతున్నట్టు వివరించాయి. కాంగ్రెస్ అగ్ర నేతలతో చర్చించనున్నట్టు పేర్కొన్నాయి.

Also Read: కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనంపై షర్మిలా రియాక్షన్ ఇదే.. ఆమె ఏమన్నారంటే?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల ఆది నుంచీ బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన తరుణంలో ఆమె ఒక్కరే ఎన్నికల్లో నెగ్గుకురావడం అసాధ్యం. కాబట్టి, కాంగ్రెస్ సహారా కోరే అవకాశాలు.. లేదా కాంగ్రెస్‌లో విలీనం అయ్యే ఆలోచనలకు బలం చేకూరుంది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత ఆమె స్వయంగా బెంగళూరు వెళ్లి మరీ డీకే శివకుమార్‌తో భేటీ కావడం ఈ చర్చను రేపింది.