గవర్నర్ వర్సెస్ కాంగ్రెస్

First Published 5, Jan 2018, 5:52 PM IST
TCongress leaders caution governor against working as TRS  leader
Highlights

టిఆర్ఎస్ కార్యకర్తలా మాట్లాడుతున్నారు

మంద కృష్ణ అరెస్టు కనబడదా?

గవర్నర్ నర్సింహ్మన్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. గవర్నర్ అనుసరిస్తున్న తీరు బాగాలేదన్నారు. కాంగ్రెస్ వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.

ఇసుక మాఫియా కట్టడి చేయాలని, మంద కృష్ణ మాదిగ అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ నర్సింహ్మన్ కు ఇవాళ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తో వాగ్వాదం జరిగినట్లు తెలిసింది.

పై రెండు అంశాలపై గవర్నర్ కు వివరించే సందర్భంలో ఆయన లైట్ తీసుకున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దీంతో ఆగ్రహానికి లోనైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, సర్వే సత్యనారాయణ ఇద్దరూ గవర్నర్ తో వాగ్వాదానికి దిగినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. వినతిపత్రం ఇచ్చే సమయం లో మీరు గవర్నర్ లా కాకుండా... టిఆర్ఎస్ నాయకుని లా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్, సర్వే సత్యనారాయణ కామెంట్ చేశారని తెలుస్తోంది.

వారి కామెంట్స్ తో గవర్నర్ సీరియస్ అయ్యారని చెబుతున్నారు. మీరు వాస్తవాలు చెప్పాలంటూ గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. కామారెడ్డిలో ఇసుక మాఫియా కారణంగా చనిపోయిన వ్యక్తి విఆర్ఎ కాదని తనకు సమాచారం ఉందని గవర్నర్ అన్నట్లు తెలిసింది. అయితే చనిపోయిన వ్యక్తి విఆర్ఎ అని కాంగ్రెస్ నేతలు చెప్పరని అంటున్నారు. తర్వాత చనిపోయింది విఆర్ఎ కాకపోయినా.. సామాన్యుడే అయినా.. ఇసుక మాఫియా కారణంగా చనిపోయాడు కదా అని కాంగ్రెస్ వారు గవర్నర్ తో వాగ్వాదానికి దిగారు.

ఇక మంద కృష్ణ మాదిగ అరెస్టు విషయంలోనూ గవర్నర్ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. గాంధేయ పద్ధతిలో తన ఆఫీసులో దీక్ష చేయడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. అయితే మంద కృష్ణ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడట కదా? అంటూ గవర్నర్ కాంగ్రెస్ వారితో అన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఈ సందర్భంగా గవర్నర్ తో మరింత వాగ్వాదమే నడిచినట్లు చెబుతున్నారు.

loader