సికింద్రాబాద్ రూబీ లాడ్జీలో అగ్ని ప్రమాదం: రంజిత్ సింగ్ బగ్గ సహ నలుగురు అరెస్ట్
సికింద్రాబాద్ రూబీ లాడ్జీలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై నలుగురిని హైద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ రూబీ లాడ్జీలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఘటనపై నలుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. మేడ్చల్ లోని ఫాంహౌస్ లో నిందితులు ఉన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
మేడ్చల్ ఫాంహౌస్ లో రంజిత్ సింగ్ బగ్గా, సుమిత్ సింగ్ బగ్గా, హోటల్ మేనేజర్ సుదర్శన్ నాయుడు, హోటల్ సూపర్ వైజర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నాడు రాత్రి రూబీ లాడ్జీ ఉన్న భవనం సెల్లార్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సెల్లార్ లో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ లో పేలి మంటలు వ్యాపించినట్టుగా అధికారులు గుర్తించారు.సెల్లార్ నుండి వచ్చిన పొగ పై అంతస్తులకు వ్యాపించింది.ఈ పొగతో లాడ్జీలో ఉన్న వారు మరణించారు. లాడ్జీ నుండి కిందకు తప్పించుకొనే మార్గం లేకపోవడంతో మెట్ల మార్గం గుండా కిందకు వచ్చేందుకు ప్రయత్నించిన కొందరు మెట్లు, లాడ్జీ కారిడార్లలో మరణించారు. ఈప్రమాదంలో మొత్తం ఎనమిది మంది మృతి చెందారు.
మరో తొమ్మిది మంది తీవ్రంగా అస్వస్థతకు గురైన ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్దంగా సెల్లార్ లో ఈ బైక్స్ షోరూమ్ నిర్వహిస్తున్నారని అగ్నిమాపక అధికారులు గుర్తించారు. మరో వైపు లిఫ్ట్ పక్కనే మెట్లు ఉండడం వల్ల కూడ పై అంతస్తులో ఉన్న వారు కిందకు వచ్చే మార్గం లేకుండా పోయిందని ఫైర్ సేఫ్టీ అధికారులు చెప్పారు. ఈ భవనం ఉన్న ఎత్తును దృష్టిలో ఉంచుకొని కనీసం రెండు వైపులా మెట్లు ఏర్పాటు చేయాలి. కానీ నిబంధనలకు విరుద్దంగా ఒకే వైపున మెట్లు ఏర్పాటు చేశారని అగ్నిమాపక అధికారులు చెప్పారు. కేవలం 11 సెకన్ల వ్యవధిలోనే మంటలు వ్యాపించినట్టుగా సీసీటీవీ పుటేజీలో పోలీసులు గుర్తించారు.
alo read:సికింద్రాబాద్ అగ్నిప్రమాదం ఘటన : ఫైర్ డిపార్ట్‌మెంట్ నివేదికలో కీలకాంశాలు
ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఈ బైక్స్ ఫోరూమ్ యజమాని రంజిత్ సింగ్ బగ్గ, భవన యజమాని సుమిత్ సింగ్ బగ్గ, హోటల్ మేనేజర్ సుదర్శన్ నాయుడు, సూపర్ వైజర్లు తప్పించుకున్నారు.ఈ ప్రమాదం జరిగిన తర్వాత వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినందుకు గాను ఈ బైక్స్ షోరూమ్ నిర్వహిస్తున్న రంజిత్ సింగ్ బగ్గ,సుమిత్ సింగ్ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ సమీపంలోని ఫాం హౌస్ లో రంజిత్ సింగ్ బగ్గ, సుమిత్ సింగ్ బగ్గ, హోటల్ మేనేజర్ సుదర్శన్ నాయుడు, సూపర్ వైజర్లను పోలీసులు అరెస్ట్ చేశారని ప్రమఖ తెలుగు న్యూస్ చానెల్ ఏబీఎన్ కథనం ప్రసారం చేసింది. ఈ ఘటనకు సంబంధం ఉన్న మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఆ కథనం వివరించింది.పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా పోలీసులు తెలిపారు.