హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పండుగ సీజన్ కావడంతో ఊర్లకెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లకు మధ్య ఒక మినీ సంగ్రామమే నడుస్తుంది.

 విధుల్లోకి రాకపోతే డిస్మిస్ చేస్తామని ప్రభుత్వం బెదిరిస్తుంటే, ఇలాంటి బెదిరింపులు మాకు కొత్త కాదని ఆర్టీసీ సంఘాలంటున్నాయి.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో పాటు మరో 26 డిమాండ్లపై ఆర్టీసీ జేఎసి నేతలు సమ్మెకు దిగారు. 

ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను బతికించేందుకు మరో పోరాటానికి తాము దిగుతున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వం నియమించిన కమిటీ తమమాటను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. తాము ఎవరి చేతుల్లో కీలుబొమ్మలం కాదన్నారు. 

మెుక్కవోని ధైర్యంతో, కార్మికులు ఐకమత్యంతో ముందుకు వచ్చి పోరాటంలో కలిసి రావాలని కోరారు. ఆర్టీసీని బతికించాలనే ఉద్దేశం డిపో మేనేజర్లకు ఉంటే వారంతా తమతో కలిసి రావాలని కోరారు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ సమ్మె కొత్తగా రాజకీయ రంగును పులుముకుంది. ప్రజాసమస్యలపైన పోరాటమంటేనే ముందుండే ఎర్రజెండా పార్టీలు ఎక్కడా స్క్రీన్ పైన కనపడడం లేదు.

తమ సమస్యలపై స్పందించకుండా, తమను డిస్మిస్ చేస్తామని ప్రభుత్వం బెదిరిస్తున్నా కామ్రేడ్లకు కనపడడం లేదా అని ఆర్టీసీ కార్మికులు కమ్యూనిస్టు నాయకులపై విరుచుకుపడుతున్నారు. 

తాము సమ్మె చేస్తుంటే సంఘీభావం కూడా తెలుపకుండా, తమను డిస్మిస్ చేస్తామని బెదిరిస్తున్న అధికార తెరాస తో చేతులు కలిపి సిద్ధాంతాలకు నీళ్లొదిలారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల పక్షాన పోరాడి కార్మికులంతా ఏకం కండి వంటివాటిని నినాదాలకే పరిమితం చేసారని వారు ఎద్దేవా చేసారు. 

కార్మికుల వ్యతిరేక ప్రభుత్వానికి సిపిఐ మద్దతెలా ఇస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఎమ్మెల్సీ పదవికోసమే ఇలా ప్రజా వ్యతిరేక ఉద్యమానికి మద్దతిస్తున్నారా అని వారు ప్రశ్నిస్తున్నారు. 

ఈ విషయమై సిపిఐ నేత నారాయణను వివరణ కోరగా వారు మాట్లాడేందుకు నిరాకరించారు.