తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటించాలని భావిస్తున్నారు. దాని కోసం త్వరలోనే బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
2023 చివరిలో జరుగుతాయని భావిస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నాయకులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు సిద్ధం కావాలని అంతర్గతంగా పిలుపునిచ్చారు. అలాగే మునుగోడు ఉపఎన్నికలో ఓటమి పాలైనా.. ఏ మాత్రం నిరుత్సాహపడకుండా పార్టీని మరింత బలంగా చేయడానికి బీజేపీ కూడా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదుపరి దశ పాదయాత్రను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
ఉగ్రవాదాన్ని నిర్మూలించేవరకు విశ్రమించం: గ్లోబల్ మీట్ ఆన్ టెర్రర్ ఫండింగ్ లో మోడీ
ఇప్పటికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల, బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాదయాత్రలు చేపడుతున్నారు. రాష్ట్రం మొత్తం చుట్టేస్తున్నారు. ఇక ఇటీవల వరుస అపజయాలతో వెనకబడిపోయిన కాంగ్రెస్ కూడా తిరిగి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. 2023లో అధికారమే లక్ష్యంగా చేసుకొని వ్యూహాలు రచిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు.. చలి గాలుల హెచ్చరికలు జారీ.. !
కాంగ్రెస్ తన ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ కానుగోలు నియమించుకున్న విషయం తెలిసిందే. ఆయన సూచనల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టి ప్రజలకు చేరువ కావాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తుందో వివరించాలని ఆయన రేవంత్ కు సూచించినట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణ రాజకీయ వ్యవహారాలను చూసుకుంటున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం పాదయాత్ర లేదా బస్సుయాత్ర చేపట్టడంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఆర్ అండ్ బీ శాఖపై కేసీఆర్ సమీక్ష... కొత్త సచివాలయంపై కీలక వ్యాఖ్యలు
ఓట్లు రాబట్టేందుకు బలమైన వ్యూహాలను రూపొందించడమే ప్రస్తుతం కాంగ్రెస్ ముందున్న ప్రధాన సవాల్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఓటింగ్ శాతం తగ్గిపోతోందని, అయితే రేవంత్ రెడ్డి పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారని భావించామని ఓ కాంగ్రెస్ నాయకుడు తెలిపినట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం పేర్కొంది. కానీ అంతకు ముందు జరిగిన ఉపఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ ఓటింగ్ శాతం మరింత తగ్గిందని ఆయన చెప్పారు. కాగా.. 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు తమ చుట్టుపక్కల అసెంబ్లీ నియోజకవర్గాలలో బస్సు యాత్ర లేదా పాదయాత్ర చేయడానికి అనుమతించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.
