తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ తమిళిసై - మంత్రి హరీశ్ రావు మ‌ధ్య ట్విట్టర్ వార్

Hyderabad: మెడికల్ కాలేజీ కేటాయింపుల విష‌యంపై తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, ఆరోగ్య మంత్రి హరీశ్ రావు మధ్య ట్విట్టర్ వార్ న‌డిచింది. గుజరాత్ ఎయిమ్స్‌కు 52 శాతం నిధులు కేటాయించగా తెలంగాణకు 11.4 శాతం  మాత్ర‌మే నిధులు ఎందుకు వచ్చాయంటూ కేంద్రం తీరును ప్ర‌శ్నించారు.
 

Tamilisai Soundararajan VS Harish Rao: Twitter war between Telangana government and governor

Tamilisai Soundararajan VS Harish Rao: తెలంగాణ ప్ర‌భుత్వం, రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య గ‌త కొంత‌కాలంగా దూరం పెరుగుతూనే ఉంది. ఇరువురి మ‌ధ్య ప్ర‌త్య‌క్ష మాట‌ల యుద్ధం ఇటీవ‌లి కాలంలో మ‌రింత‌గా పెరిగింది. ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తూ గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌లు చేయ‌డం, గ‌వ‌ర్న‌ర్ ల‌క్ష్యంగా అధికార పార్టీ విమ‌ర్శ‌లు గుప్పించ‌డం రాష్ట్రంలో ఇది సాధార‌ణ విష‌యంగా మారిపోయింది. ఇదే క్ర‌మంలో రాష్ట్రానికి కేంద్రం మెడికల్ కాలేజీల కేటాయింపుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలు రాజ‌కీయంగా హాట్ టాపిక్ గా మారాయి. గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌ల‌పై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ నేప‌థ్యంలోనే రాజ్ భ‌వ‌న్, హ‌రీశ్ రావు మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్ న‌డిచింది. 

కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పినట్లుగా తెలంగాణకు ఎన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చారని ఓ ట్విటర్ యూజర్ అడిగిన ప్రశ్నకు గవర్నర్ బదులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో దరఖాస్తు చేయడంలో విఫలమైందని పేర్కొన్నారు. "మీరు ఆలస్యంగా నిద్రలేచి అడుగుతారు. తమిళనాడులో ఒకే ఏడాదిలో 11 మెడికల్ కాలేజీలు వచ్చాయంటూ" స‌మాధాన‌మిచ్చారు.

 

 

 

ఇక గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌ల‌పై మంత్రి హ‌రీశ్ రావు మండిప‌డ్డారు. కేంద్ర తీరు ఎలాంటిదో ప్ర‌జ‌ల‌కు తెలుసున‌ని పేర్కొన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ పూర్తికి అంచనా వేసిన రూ.1365 కోట్లలో కేంద్రం కేవలం రూ.156 కోట్లు మాత్రమే విడుదల చేసిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. గుజరాత్ ఎయిమ్స్ కు కేటాయించిన నిధుల్లో 52 శాతం తెలంగాణకు 11.4 శాతం మాత్రమే ఎందుకు వచ్చాయని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రాజ్ భవన్ తన దృష్టిని మరల్చి గిరిజన విశ్వవిద్యాలయం, రైల్ కోచ్ ఫ్యాక్టరీ కోసం భారత ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే తెలంగాణ ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

 

 

తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఎవరూ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. "తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రాన్ని ఎందుకు తప్పు పట్టరు? ఏపీఆర్ఏ 2014లో ఇచ్చిన హామీ మేరకు రాజ్ భ‌వ‌న్ తన దృష్టిని మరల్చి గిరిజన విశ్వవిద్యాలయం, రైల్ కోచ్ ఫ్యాక్టరీ కోసం భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువ‌స్తే అది తెలంగాణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది" అంటూ గ‌వ‌ర్న‌ర్ కు మంత్రి చుర‌క‌లు అంటించారు. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విన్నవించినా మెడికల్ కాలేజీల మంజూరులో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నది వాస్తవమ‌ని అన్నారు.

కేంద్రం ఆమోదించిన 157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించలేదన్నారు. కాలేజీల కేటాయింపులో మూడు దశల్లోనూ కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపి తెలంగాణను మోసం చేసిందని మండిప‌డ్డారు. ఇప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్న జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినందున తెలంగాణకు మెడికల్ కాలేజీలు కేటాయించలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదెవరని ప్రశ్నించారు. "మెడికల్ కాలేజీలపై కేంద్ర మంత్రులు భిన్నమైన ప్రకటనలు చేయడం దారుణం. ఒకరు తెలంగాణ ఎలాంటి అభ్యర్థన చేయలేదనీ, మరొకరు ఖమ్మం, కరీంనగర్ లలో ప్రభుత్వ కళాశాలలు కావాలని అన్నారు. ఇప్పటికే ప్రైవేటు కాలేజీలు ఏర్పాటు చేసినందున కేంద్రం అనుమతి ఇవ్వలేదని చెప్పడం ద్వారా ప్రజలను ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారని" ప్రశ్నించారు.

 

 

ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నిధులతో తెలంగాణలో 12 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారన్నారు. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలన్న దార్శనికతకు అనుగుణంగా మెడికల్ కాలేజీలను కేటాయించినట్లు తెలిపారు. ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. దూషణలకు దిగే బదులు ఒకే రోజు 8 మెడికల్ కాలేజీలు తెరిచినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం, గవర్నర్ అభినందించాలన్నారు. 2018లో రెండు ప్రాజెక్టులు మంజూరైనప్పుడు గుజరాత్ ఎయిమ్స్ కు 52 శాతం నిధులు రాగా, తెలంగాణకు 11.4 శాతం మాత్రమే ఎందుకు వచ్చాయని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఢిల్లీ ఎయిమ్స్ తో సమానంగా ఉండాల్సిన బీబీనగర్ ఎయిమ్స్ కు నిధులు ఇవ్వడానికి బదులు కేంద్ర మంత్రి తెలంగాణ ప్రభుత్వాన్ని నిందిస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios