తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం ఉదయం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమెతో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ నేతలు హాజరయ్యారు. తమిళనాడు నుంచి అన్నాడీఎంకే అగ్రనేత, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం హాజరయ్యారు.

అంతకు ముందు చెన్నై నుంచి బేగంపేట హైదరాబాద్‌కు చేరుకున్న సౌందరరాజన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆమె పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఎయిర్‌పోర్ట్ నుంచి తమిళిసై నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.