ఈ ఫొటోలో కనబడుతున్న అమ్మాయి జనాలను మాయచేసి బుట్టలో వేసుకునే విద్యలో పిహెచ్ డి చేసినట్లుంది. అందుకే వరంగల్ లో కొంతమందిని ఉత్తగనే నమ్మించి మోసం చేసి ఏం చక్కా చెక్కేసింది. ఇంతకూ ఈ అమ్మాయి ఎవరు? ఈమె ముచ్చటేందని అనుకుంటున్నరా? అయితే చదవండి స్టోరీ.

ఈమె పేరు ప్రియదర్శిని (అలా చెప్పుకుంది). వరంగల్ నగరంలో దిగింది. తను చెన్నై కి చెందిన దానినని ఒక హాస్టల్ లో ఉండే అమ్మాయితో పరిచయం చేసుకుంది. తమిళనాడు రాజకీయ నేత శశికళ బంధువునంటూ నమ్మబలికింది. తనకు కోట్లాది రూపాయల ఆస్తులున్నా.. ఏమీ లేనిదానిలా ఇలా తిరగాల్సివస్తోందని ఆ అమ్మాయి దగ్గర కట్టు కథలు.. పిట్టకథలు చెప్పింది. తనకు అవసరం ఉన్నాయంటూ.. 30వేల రూపాయలను ఆ అమ్మాయి క్రెడిట్ కార్డు ద్వారా వాడుకుంది. తర్వాత కొన్నిరోజుల్లోనే ఆ కార్డు తాలూకు ఎకౌంట్ లో 30వేలు తిరిగి జమ చేసింది. దీంతో ఇద్దరి మధ్య క్లోజ్ ఫ్రెండిప్ ఏర్పడింది.

ఇదే అదునుగా చెన్నై కిలేడి తన హాస్టల్ మెట్ అమ్మాయి స్నేహితులందరితో దోస్తాన్ చేసింది. అందులో ఆడ, మగవారున్నారు. ఈ సందర్భంగా వారందరికీ ఒక కథ చెప్పింది. తనకు చెన్నైలో బ్లాక్ మనీ వచ్చేది ఉందని.. అది వస్తుందని చెప్పి నమ్మబలికింది. ఆ నల్లధనం తెచ్చేందుకు మీరంతా సహకారం చేయాలని కోరింది. ఆమె చెప్పిన మాటలకు ఒక ప్రేమజంటతోపాటు మరో పెళ్లయిన డ్యాన్స్ మాస్టర్ కూడా సరే అన్నారు. బ్లాక్ మనీ తేవడం కోసం పకడ్బందీగా ప్లాన్ చేద్దామని నమ్మబలికింది. ఆ డబ్బు బెంగుళూరులో మనకు అందజేస్తారని, మనమంతా బెంగుళూరు పోదామంటూ వారిని విమానంలో తీసుకుపోయింది. అక్కడ ఖరీదైన ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేసింది. బ్లాక్ మనీ వస్తే మన కష్టాలన్నీ గట్టెక్కుతాయి కదా అన్న ఆశతో వారే ఆ విమాన ఛార్జీలు, హోటల్ బిల్లులు చెల్లించారు. తీరా అక్కడ బ్లాక్ మనీ అందలేదని... పోలీసులు టైట్ సెక్యూరిటీ కారణంగా ఆ డబ్బు రాలేదని బెంగుళూరు నుంచచే ఎవరో వ్యక్తితో ఫోన్ లో మాట్లాడింది. ఆ వివరాలను వీళ్లకు చెప్పింది. వరంగల్ కు పార్సిల్ ద్వారా అందుతుందని తేల్చేసి తిరిగి వరంగల్ వచ్చేశారు అందరూ కలిసి.

ఇదిలా ఉండగానే ఇంకిన్ని చలాకి పనులు, కిలాడీ పనులు చేసింది ఆ చెన్నై ప్రియదర్శిని. ఆమెకు పరిచయం అయిన బృందంలో ఉన్న ఒక డ్యాన్స్ మాస్టర్ ను బలవంతంగా ఉత్తుత్తి పెళ్లి చేసుకుంది. ఆ డ్యాన్స్ మాస్టర్ కు గతంలోనే పెళ్లయింది. అయినా వత్తిడి చేసి పెళ్లి చేసుకుంది. తను డాక్టర్ కాబట్టి డాక్టర్ భర్త కారులో తిరగపోతే ఎలా అంటూ.. నాలుగు కార్లు బుక్ చేసింది. వాటికి చెక్ లు ఇచ్చేసింది. తన భర్తతోపాటు తన స్నేహితులకు కూడా కార్లు ఇప్పిస్తున్నానంటూ నమ్మబలికింది. ఇదే సమయంలో తన భర్తకు కాస్టిలీ హార్డ్ లీ డేవిడ్ సన్ బైక్ కొనిస్తానంటూ హైదరాబాద్ తీసుకొచ్చి చెక్ ద్వారా ఆ బైక్ బుక్ చేసింది. ఇక ఖరీదైన ఇల్లు కూడా కావాలి కదా అంటూ వరంగల్ పట్టణంలోని హంట్ రోడ్ లో ఉన్న ఒక విల్లా బుక్ చేద్దామని అందరితో కలిసి వెళ్లింది. అయితే విల్లా కొనాలంటే క్యాష్ మాత్రమే కావాలని, చెక్ తీసుకోనని యజమాని చెప్పడంతో విల్లా కొనుగోలు ఆగిపోయింది. అయితే ఈమె వ్వయహారం విల్లా యజమానికి తెలిసి విల్లా అమ్మేందుకు నిరాకరించారు. దీంతో ప్రియదర్శినితో తిరుగుతున్న దంటగాళ్లకు కూడా ఆమె మీద అనుమానం వచ్చింది. అయితే మీరేం టెన్షన్ పడకండి. హోటల్ సుప్రభ (త్రి స్టార్ హోటల్) లో సెటిల్ చేసుకుందాం రండి అంటూ వారికి చెప్పింది... వారు అక్కడికి వెళ్లేలోగా వరంగల్ నుంచి పరారైంది. దీంతో తాము మోసపోయామని బాధితులు అనుకున్నారు.

అయితే ఈ విషయమై ఇప్పటికీ ఇంకా పోలీసులకు ఫిర్యాదు అందలేదు. పోలీసుల నోటీసులో విషయం ఉన్నప్పటికీ ఎవరూ ఫిర్యాదు చేయలేదు కాబట్టి కేసు నమోదు చేయలేదు పోలీసులు. అయితే ఈ విషయంలో కంప్లెంట్ చేస్తే.. ఎక్కడ తమ పరువు పోతుందో అని ఆ టెంపరరీ భర్త, మిగతా దోస్తులు మింగలేక కక్కలేక సతమతమవుతున్నారు. ఇక అందులో మొదట పరిచయం అయిన అమ్మాయి 80వేల రూపాయలు క్రెడిట్ కార్డు ద్వారా కొట్టేసింది ప్రియదర్శిని. ఆ డబ్బు పోయిన అమ్మాయి లబోదిబోమంటున్నది. పోలీసు కేసు పెడితే విషయం బయటకు తెలిసి తల్లిదండ్రులకు తెలస్తుందేమోనని ఆ అమ్మాయి భయపడుతోంది.

మొత్తానికి వరంగల్ జనాలకు ఈ చలాకీ కిలేడీ ప్రియదర్శిని భయంకరమైన షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.