Huzurabad Bypoll: టీఆర్ఎస్ వాళ్లిచ్చే పైసలు తీసుకోండి.. బీజేపీకి ఓటేయండి: బండి సంజయ్

హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరఫున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం చేస్తూ టీఆర్ఎస్‌పై విమర్శలు చేశారు. టీఆర్ఎస్ నేతలు ఓటుకు రూ. 20వేలు పంచుతున్నారని, ఆ డబ్బులు తీసుకుని ఓటు మాత్రం బీజేపీకే వేయాలని కోరారు. గడీల రాజ్యం కావాలా? పేదల రాజ్యం కావాలా ఆలోచించాలని ప్రజలకు తెలిపారు.
 

take money from trs cast vote for bjp says bandi sanjay in huzurabad bypoll campaign

కరీంనగర్: హుజురాబాద్ మండలంలోని సింగాపూర్ గ్రామంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం చేశారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే రావూరి ప్రకాశ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డిలూ పాల్గొన్నారు. నేటితో దేశంలో 100 కోట్ల డోసుల పంపిణీ పూర్తయిన ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని, మోడీగారికి హ్యాట్సాఫ్ చెబుతున్నట్టు తెలిపారు. తెలంగాణలో చికిత్స వ్యయాన్ని భరించలేక ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చినా కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్పించని ఘనుడు కేసీఆర్ అని, కరోనా చికిత్స చేయించుకునే అవకాశమున్న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయనీయలేదని విమర్శలు చేశారు.

హుజురాబాద్‌లో అగ్గిపెట్టె మంత్రి హరీశ్ రావు బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రజలు ఆయన అగ్గిపెట్టెలో అగ్గిపుల్లలున్నాయా? అని అడుగుతున్నారని వ్యంగ్యంగా మాట్లాడారు. హుజురాబాద్‌లో గెలిచేందుకు టీఆర్ఎస్ నేతలు ఓటుకు సుమారు రూ. 20వేల ఇస్తున్నారని ఆరోపించారు. తప్పకుండా ఆ డబ్బులు తీసుకోండని ప్రజలకు సూచించారు. అయితే, ఓటు మాత్రం బీజేపీకే వేయండని పిలుపునిచ్చారు. ఈ నెల 30న జరిగే పోలింగ్ రోజున కుటుంబం సహా అందరూ బీజేపీ ఓటేయాలని కోరారు. వచ్చే నెల 2న ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ బాక్సులు బద్ధలవ్వాలని తెలిపారు.

1400 మంది బలిదానాలతో తెలంగాణ వస్తే కేసీఆర్ కుటుంబం రాజ్యమేలుతున్నదని, తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం చేసిన త్యాగాలేమిటో చెప్పాలన్నారు. రాష్ట్రంలో గడీల రాజ్యం కావాలా? పేదోళ్ల రాజ్యం కావాలా? ప్రజలే  ఆలోచించుకోవాలని చెప్పారు. రుణమాఫీ చేయరని, వరి వేస్తే ఉరి గతి అని రైతులు భయపడుతున్నారని తెలిపారు. ఎన్నికలు వస్తే డబ్బులతో ఓట్లు కొని గెలవాలని టీఆర్ చూస్తున్నదని, ఫోర్జరీ లేఖలు సృష్టించి గట్టెక్కాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ఎన్నికల సమయంలో తన పేరు మీద దొంగ లేఖ సృష్టించారని, భాగ్యలక్ష్మీ వద్ద ప్రమాణం చేద్దాం రమ్మని సవాల్ చేస్తే తోకముడిచాడని అన్నారు. ఇప్పుడు కూడా బీజేపీ వల్లే దళిత బంధు ఆగిందని మళ్లీ దుష్ప్రచారం చేస్తున్నారని, యాదాద్రికి వచ్చి దీనిపై ప్రమాణం చేయాలని సవాల్ చేస్తే నోరు మెదపడం
లేదని అన్నారు. 

Also Read: Huzurabad Bypoll: దళిత బంధుని ఆపాలని నేను లేఖ రాసినట్టు నిరూపిస్తారా?.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బండి

హుజురాబాద్ ఎన్నికల్లో గెలవడానికి టీఆర్ఎస్ నేతలు మందు పోస్తున్నారని, మటన్, చికెన్ పెడుతున్నారని, పైసలు ఇస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. పొరపాటున టీఆర్ఎస్ గెలిస్తే చుక్కలు చూపిస్తారని వివరించారు. సమస్యలతో వెళ్లే ప్రజలను పుణ్యానికి ఓటేశారా? అని హేళన చేస్తారని, ప్రజలంతా ఒక్కసారి ఆలోచించాలని తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios