హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తహాశీల్దార్ విజయారెడ్డి హత్య కేసు రాజకీయ రంగు పులుముకుంది. విజయారెడ్డి హత్యపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. 

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిల మధ్య తహాశీల్దార్ హత్య గొడవ పెద్ద రాద్ధాంతమే సృష్టిస్తోంది. తనపై ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి. విజయారెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎలాంటి విచారణకు అయినా తాను సిద్ధమేనంటూ చెప్పుకొచ్చారు. 

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భూదందాలే విజయారెడ్డి హత్యకు కారణమని ఆరోపించారు. ల్యాండ్ మాఫియా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో చెలరేగిపోతుందని మల్ రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. విజయారెడ్డి హయాంలో భూ లావాదేవీలపై తాను చర్చకు సిద్ధమని మంచిరెడ్డి కిషన్ రెడ్డి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. 

గెలవకపోయినా గెలిచినట్లుగా నిరూపించచుకున్న వ్యక్తి మంచిరెడ్డి కిషన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి భూ దందా వల్లే ఒక మహిళా అధికారి మంటల్లో కాలిపోయి బుగ్గైపోయారన్నారు. దీనికంతటికి కారణం మిస్టర్ భూ కబ్జా దారుడు కిషన్ రెడ్డి అంటూ ఆరోపించారు. 

విజయారెడ్డి హత్య జరిగి రోజులు దాటుతున్నా ఇప్పటి వరకు విచారణలో వాస్తవాలు వెలుగులోకి రాలేదన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భూ దందాలు, వివాదాస్పదంలో ఉన్న ఏడెకరాల భూమి ఆమె హత్యకు కారణమని ఆరోపించారుమల్ రెడ్డి రంగారెడ్డి. 

నయీంలాంటి ముఠాలను మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఏర్పరచుకున్నారని ఆరోపించారు. విజయారెడ్డి హత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. హత్యకు గురైనప్పటి నుంచి తాను ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుతున్నాని రాష్ట్రంలో మహిళా అధికారులు ఉద్యోగం చేసేలా భద్రత కల్పించాలని కోరుతున్నట్లు తెలిపారు. 

ఓ భూ వివాదంలో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి రూ.30 లక్షలు డిమాండ్ చేశారని తాను అనలేదన్నారు. కిషన్ రెడ్డి లాంటి మెునగాడు రూ.30లక్షలు తీసుకునే వ్యక్తికాదని రూ.30 కోట్లు తీసుకునే వ్యక్తి అంటూ ఆరోపించారు. 

రూ.400 కోట్లు విలువైన ప్రభుత్వ భూమిని మంచిరెడ్డి కిషన్ రెడ్డి అనుచరులు ఆక్రమించుకున్నారని స్పష్టం చేశారు. ఆ భూములు ఆక్రమించుకున్న వారంతా కిషన్ రెడ్డి అనుచరులేనని వాస్తవానికి ఆక్రమించుకుంది కిషన్ రెడ్డి అంటూ ఆరోపించారు. 

విజయారెడ్డి హత్య నేపథ్యంలో పిచ్చోడిలా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడని గడ్డిపీకారా అంటూ ప్రశ్నించారు. సన్నాసిలా మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. సీబీఐ విచారణ చేపడితే విజయారెడ్డి హత్యకు ముందు హత్య తర్వాతతోపాటు నయీం కేసులో వివరాలు కూడా బయటకు వస్తాయన్నారు.  

మల్ రెడ్డి రంగారెడ్డి తప్పు చేశాడని నిరూపించాలన్నారు. మల్ రెడ్డి రంగారెడ్డి ఏనాడు తప్పు చేయలేదన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని తాను తప్పు చేస్తే  సీబీఐ విచారణ చేయించ వచ్చు కదా అని నిలదీశారు. 

గతంలోనే తాను మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై పోరాటం చేశానని తెలిపారు. గతంలోనే డీజీపీ, ముఖ్యమంత్రి, కీలక అధికారులతో తాను భేటీ అయి ఫిర్యాదులు చేశానని తెలిపారు. కిషన్ రెడ్డి గ్యాంగ్ స్టర్ నయీంతో కలిసి తిరుగుతున్నప్పుడే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై సస్పెండ్ వేటు వేస్తే ఇలాంటి పరిస్థితి నెలకొనేది కాదన్నారు. ఒక మహిళా అధికారి అకారణంగా బలయ్యేది కాదని చెప్పుకొచ్చారు. 

ఇకపోతే అధికార పార్టీ నేతలు తమను వేధిస్తున్నారంటూ గతంలో పలుమార్లు విజయారెడ్డి తన దగ్గర వాపోయిందన్నారు. విజయారెడ్డిని హత్య చేసిన సురేష్ ఒక టీఆర్ఎస్ కార్యకర్త అంటూ మల్ రెడ్డి రంగారెడ్డి తెలిపారు. 

ఇప్పటికైనా కేసీఆర్ తహాశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ చేస్తేనే మరో మహిళా అధికారి ఇలాంటి దారుణాలకు బలవ్వదన్నారు. కేసీఆర్ కు తెలంగాణలో బంపర్ మెజారిటీ ఉందని ఒక ఎమ్మెల్యేపై విచారణ కు ఆదేశిస్తే వచ్చే నష్టమేది లేదన్నారు మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి.   

ఈ వార్తలు కూడా చదవండి

tahsildar Vijaya Reddy: మల్ రెడ్డిపై మంచిరెడ్డి సంచలన ఆరోపణలు

Tahsildar vijayareddy: నా భర్త అమాయకుడు.. నిందితుడు సురేష్ భార్య

విజయారెడ్డి హత్య వెనుక టీఆర్ఎస్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు