హైదరాబాద్:  ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం నాడు మధ్యాహ్నం దారుణం చోటు చేసుకొంది. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్టులో తహసీల్దార్ విజయారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తహసీల్దార్ విజయారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని  అబ్దుల్లాపూర్‌మెట్టు తహసీల్దార్ కార్యాలయంలోకి ఓ దుండగుడు సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు వచ్చాడు.తహసీల్దార్ విజయారెడ్డితో మాట్లాడాలంటూ ఆమె చాంబర్‌లోకి వెళ్లాడు. తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లిన ఆ దుండగుడు ఆమెపై పెట్రోల్ పోశాడు. వెంటనే ఆమెకు నిప్పంటించాడు.

అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు  విజయారెడ్డిపై మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. దీంతో విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరికి గాయాలు అయ్యాయి.

విజయారెడ్డి చాంబర్ నుండి  దుండగుడు బయటకు వెళ్లిన తర్వాత తహసీల్దార్ అరుచుకొంటూ తన చాంబర్ నుండి  కారిడార్ కు పరిగెత్తుకొంటూ వచ్చింది. అప్పటికే ఆమెకు మంటలు అంటుకొన్నాయి.

విజయారెడ్డి మంటల్లో చిక్కుకొన్న విషయాన్ని గుర్తించిన ఇద్దరు వ్యక్తులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. తహసీల్దార్ కారిడార్‌ లోకి వచ్చేసరికి పూర్తిగా ఆమె మంటలకు ఆహుతైంది పూర్తిగా  మంటల్లో చిక్కుకుపోయిన విజయారెడ్డి అక్కడికక్కడే కప్పకూలి మృతి చెందినట్టుగా తోటి ఉద్యోగులు చెప్పారు.

తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి నేరుగా పోలీసులకు లొంగిపోయినట్టుగా సమాచారం.తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసే ముందు ఆమెతో ఆమె ఛాంబర్‌లోనే 30 నిమిషాల పాటు మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.
 
విజయారెడ్డితో మాట్లాడాలంటూ నిందితుడు ఆమె చాంబర్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే తొలుత తహసీల్దార్ విజయారెడ్డి అటెండర్ అడ్డుకొన్నారు. మీటింగ్ పూర్తైన తర్వాత విజయారెడ్డి ఛాంబర్లోకి దుండగుడు వెళ్లినట్టుగా ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

తహసీల్దార్ విజయారెడ్డి మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో విజయారెడ్డి మృతదేహనికి పోస్టు మార్టం నిర్వహించనున్నారు. విజయారెడ్డిని సజీవ దహనం చేసిన తర్వాత పిందితుడు పారిపోతున్న సమయంలో స్థానికులు అతడిని వెంటాడి పట్టుకొన్నారు.

విజయారెడ్డిపై నిందితుడు ఎందుకు పెట్రోల్ పోసి నిప్పంటించాడనే  విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయం తెలిసిన వెంటనే రెవిన్యూ ఉద్యోగుల సంఘం నేతలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొన్నారు. 

ఈ ఘటనను రెవిన్యూ ఉద్యోగులు సీరియస్‌గా తీసుకొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మార్వోలకు భద్రతను కల్పించాలని రెవిన్యూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 

ఈ ఘటనపై  మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆరా తీశారు. పోలీసులు ఉన్నతాధికారులు వెంటనే  సంఘటన స్థలానికి చేరుకొని ఘటనకు సంబంధించిన తీరుతెన్నులపై ఆరా తీస్తున్నారు.