అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ ఆఫీసు అటెండర్‌ చంద్రయ్య పరిస్థితి విషమించింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రయ్యను తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది కానీ... ప్రభుత్వాధికారులు కానీ పట్టించుకోలేదు.

ఇప్పటికే మూడు లక్షల వరకు బిల్లు అయ్యిందని.. డబ్బు చెల్లిస్తేనే చికిత్స చేస్తామని సదరు ఆసుపత్రి వర్గాలు తేల్చి చెప్పాయి. డబ్బులు లేకపోతే ఇప్పటి వరకు అయిన వైద్య ఖర్చులు చెల్లించి తర్వాత చికిత్స కోసం ఏదైనా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని ఆసుపత్రి వర్గాలు చంద్రయ్య కుటుంబసభ్యులకు తెలిపాయి.

దీంతో వారు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా... చంద్రయ్యను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అధికారుల స్పందనపై చంద్రయ్య కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది

Also Read:vijayareddy: తహసీల్దార్ విజయారెడ్డి హత్య....బయటపడుతున్న షాకింగ్ నిజాలు

ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటామని కుటుంబసభ్యులు హెచ్చరించారు. కాగా తహశీల్దార్ విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో చంద్రయ్యకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో తోటి సిబ్బంది అతనిని దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 

సోమవారం నాడు అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో విజయా రెడ్డిపై సురేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.మంటల్లో చిక్కుకొన్న ఎమ్మార్వో విజయారెడ్డిని కాపాడేందుకు డ్రైవర్ గురునాథం తీవ్రంగా ప్రయత్నించాడు.

ఈ ఘటనలో గురునాథానికి 80 శాతం గాయాలయ్యాయి. దీంతో ఆయనను డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ గురునాథం మంగళవారం నాడు ఉదయం మృతి చెందాడు.

Also Read:విజయారెడ్డి సజీవదహనం.... అందుకే చంపానంటున్న నిందితుడు సురేష్

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని  అబ్దుల్లాపూర్‌మెట్టు తహసీల్దార్ కార్యాలయంలోకి ఓ దుండగుడు సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు వచ్చాడు.తహసీల్దార్ విజయారెడ్డితో మాట్లాడాలంటూ ఆమె చాంబర్‌లోకి వెళ్లాడు. తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లిన ఆ దుండగుడు ఆమెపై పెట్రోల్ పోశాడు. వెంటనే ఆమెకు నిప్పంటించాడు.

అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు  విజయారెడ్డిపై మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. దీంతో విజయారెడ్డిని కాపాడేందుకు డ్రైవర్ గురునాథం, అటెండర్ చంద్రయ్య ప్రయత్నించారు. డ్రైవర్ గురునాథం 80 శాతం కాలిపోయాడు. చంద్రయ్య 60 శాతం కాలిపోయాడు.

సూర్యాపేట జిల్లాకు చెందిన గురునాథం సుమారు ఆరు ఏళ్లుగా పనిచేస్తున్నాడు. విజయారెడ్డిని తన సోదరిగా గురునాథం భావించాడు. దీంతో ఆమె గురునాథాన్నే తన డ్రైవర్ గా కొనసాగించింది. విజయారెడ్డి కుటుంబంలో సభ్యుడిగా గురునాథం ఉండేవాడని ఆ కుటుంబానికి చెందిన వాళ్లు చెబుతున్నారు.