Asianet News TeluguAsianet News Telugu

కోరిక తీరిస్తేనే రైతు బంధు చెక్: మహిళారైతుపై దాష్టీకం

నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ మహిళా రైతును తహసీల్దార్ బ్లాక్ మెయిల్ చేశాడు.

Tahisladar blackmailed lady farmer

హైదరాబాద్‌: నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ మహిళా రైతును తహసీల్దార్ బ్లాక్ మెయిల్ చేశాడు. తన కోరిక తీరిస్తేనే రైతు బంధు పథకం కింది చెక్కు ఇస్తానని, లేదంటే భూమిపై సివిల్ దావా వేయిస్తానని బెదిరించాడు. రోడ్డు ప్రమాదంలో కాళ్లూ చేతులూ విరిగిన భర్తతో భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసుకుంటున్న మహిళ దీన గాధ ఇది

ఆ మహిళపై తహసీల్దార్ కన్నేసి తన కామవాంఛను బయటపెట్టాడు. అయితే, ఆ మహిళ అతనిపై మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్‌సీ)ని ఆశ్రయించింది. తెలంగాణ రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చిన్నిపాడులో బాధితురాలి తల్లికి సర్వే నంబర్‌ 57/ఏలో 1.06 ఎకరాల భూమి ఉంది. 

ఆ భూమికి సంబంధించిన కొత్త పట్టా పాస్‌బుక్కు, రైతు బంధు చెక్కు మంజూరయ్యాయి. ఆ భూమిని కబ్జా చేయాలని భావించిన కొందరు చెక్కును, పాస్‌బుక్కును వాళ్లకు ఇవ్వకుండా అడ్డుకున్నారు. తన కార్యాలయానికి రావాలని బాధితురాలికి, ఆమె తల్లికి దీంతో మానవపాడు తహసీల్దార్‌ చెప్పాడు. 

ఈ నెల 11న అక్కడికి వెళ్లిన తర్వాత గ్రామంలోని ముగ్గురు వ్యక్తులతో ఆ భూమిపై సివిల్‌ కేసు వేయిస్తానని, అలా చేస్తే కొత్త పాస్‌బుక్‌ ఇవ్వడం కుదరదని తహసీల్దార్‌ బెదిరించాడు. 

ప్రతి రైతు రూ.2వేలు చెల్లించి పట్టాపాస్‌బుక్కు, రైతుబంధు చెక్కు తీసుకుపోతున్నారని చెప్పాడు. సివిల్‌ కేసు లేకుండా, ఎలాంటి డబ్బు ఇవ్వకుండా పాస్‌బుక్కు, రైతుబంధు చెక్కు కావాలంటే తన లైంగిక వాంఛ తీర్చాలని కోరాడని, అందుకు ఒప్పుకోకపోవడంతో అసభ్యపదజాలంతో దూషించాడని హెచ్‌ఆర్‌సీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆమె చెప్పింది. 

ఆ ఫిర్యాదును విచారణకు స్వీకరించిన హెచ్‌ఆర్‌సీ జోగుళాంబ గద్వాల్‌ జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసి ఘటనపై సెప్టెంబర్‌ 9లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios