కరోనా వైరస్ ఒక్కసారిగా పెరగడానికి కారణం తబ్లీగి జమాత్ అని ఇటు మీడియా నుంచి అటు ప్రభుత్వాల వరకు ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపారు. ఒకరకంగా ఈ మొత్తం తబ్లీగి ఎపిసోడ్ వల్ల ఈ కరోనా వైరస్ కే ఏకంగా మతం రంగు పులిమినట్టుగా అయింది. 

అయితే ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి పంజా విసురుతూ ప్రజల ప్రాణాలను బలిగొంటున్న వేళ... అదే ఢిల్లీ మర్కజ్ కి వెళ్లిన వారే  ప్రాణదాతలుగా మారుతున్నారు. 

కరోనా వైరస్ వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నవారికి తమ ప్లాస్మాను ఇచ్చి వారిని రక్షించడానికి తబ్లిగీ జమాత్ కు వెళ్లి వచ్చినవారు ముందుకు వస్తున్నారు. అటు ఢిల్లీ నుంచి ఇటు హైదరాబాద్ వరకు ఇలా ఢిల్లీకి వెళ్లి వచ్చి, కరోనా వైరస్ నుంచి బయటపడ్డ వారందరూ ముందుకు వచ్చి ప్రభుత్వాలకు తాము ఇతరులను రక్షించడానికి సిద్ధమని తెలుపుతూ తమ అంగీకార పత్రాలను ఇస్తున్నారు. 

తాజాగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి ఇలా మర్కజ్ నుంచి వచ్చిన, కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న వారు తమ ప్లాస్మాను డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ కి లేఖ రాసారు.

ప్లాస్మా డొనేషన్ వల్ల ఏం లాభం?

సింపుల్ గా చెప్పాలంటే....,ఇలా వైరస్ నుండి బయటపడ్డ వారి శరీరాల్లో కరోనా వైరస్ ని ఎదుర్కొనేందుకు యాంటీబాడీస్ తయారవుతాయి. ఇలా వారి నుండి ప్లాస్మాను తీసుకొని ఈ వైరస్ బారిన పడి, ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న వారికి ఎక్కిస్తారు. 

ఇలా ప్లాస్మా ఎక్కించడం వల్ల వారికి కూడా ఈ కరోనా వైరస్ పై పోరాడేందుకు శరీరంలో యాంటీబాడీస్ తయారవుతాయి. సదరు పేషెంట్ అప్పుడు కరోనా వైరస్ నుంచి త్వరగా కోలుకునే ఆస్కారముంటుంది. 

అప్పుడు ఎవరినైతే దేశంలో కరోనా వైరస్ వ్యాపింపజేస్తున్నారు, వీరివల్ల కరోనా వైరస్ అందరికి సోకుతుంది అని అన్నారో.... ఇప్పుడు వారే కరోనా వైరస్ తో బాధపడుతున్న రోగులకు ప్రాణదాతలుగా మారుతున్నారు.