టి జెఎసి చైర్మన్ కోదండరాం వెల్లడి వెబ్ సైట్ కూడా తీసుకరానున్నట్లు ప్రకటన

తెలంగాణలో ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షంగా మారిన తెలంగాణ రాజకీయ జేఏసి తన పోరును మరింత ఉదృతం చేసేలా కనిపిస్తుంది. టి జెఎసి పై గులాభి నేతలు చేస్తున్న ప్రత్యక్షదాడి, వ్యక్తిగత విమర్శలను ధీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తుంది. ఇందులో భాగంగానే టి జెఎసి తరఫున ఒక దినపత్రిక, వెబ్ సైట్ తీసుకరావాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తాండూరులో జరిగిన ఒక సమావేశంలో స్వయంగా జెఎసి చైర్మన్ కోదండరామే ప్రకటించడం విశేషం.

ఇప్పుడే ఎందుకు...

పత్రిక నడపడం అనేది సామాన్య వ్యవహారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు. తెలుగునాట ఎందరో బడాబాబులు ఆర్భాటంగా పత్రికలు పెట్టి తర్వాత నష్టాలతో చేతులు కాల్చుకున్నావారే. ఈ విషయాలన్నీ టి జెఎసికి తెలియదనుకోవడం పొరపాటే. అయినా సాహసించి ఇలా పేపర్ తీసుకొస్తున్నారంటే దాని వెనక భారీ పథకమే ఉందన్నది మాత్రం నిజం.

ముఖ్యంగా రాజకీయాధికారం కొల్పోయిన ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన ఎన్ ఆర్ ఐ ల ఆర్థిక ప్రొద్భలంతో ఈ పత్రిక తీసుకరానున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడంలో అన్ని పత్రికలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తే అది తెలంగాణ ప్రజలను విమర్శిస్తున్నట్లు టిఆర్ఎస్ నేతలు దాడులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన పత్రికలు ఏవీ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంపై నెగిటివ్ వార్తలు రాయడం లేదు.

అదే సమయంలో టి జెఏసికి కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన కవరేజిని ఏ పత్రిక ఇవ్వడం లేదు.

ముఖ్యంగా రాష్ట్ర ఏర్పాటు తర్వాత టి జెఎసి అనేక కార్యక్రమాలు చేపట్టింది. రైతు ఆత్మహత్యలు, ఏజెన్సీ మరణాలు, భూ సేకరణ చట్టం, ఉద్యోగనియామకాలు తదితర అంశాలపై చాలా చోట్ల మీటింగులు పెట్టి ప్రభుత్వానికిపై విమర్శనాస్త్రాలు సంధించింది. కానీ, ప్రసార సాధనాలు ఈ విషయాలకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం లేదు.

బాధితుల పక్షాన టి జెఎసి ఎంతో పోరాటం చేస్తున్న ఆ విషయం ప్రజలకు వెళ్లడం లేదు. వారి పోరాటం అరణ్యరోదనగానే మారుతోంది. ఈ నేపథ్యంలోనే టి జెఎసి తమ వాణిని ఘనంగా వినిపించేందుకు సొంతంగా పత్రిక తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.

అయితే ఎలాంటి లాభాలు ఆర్జించకుండా, వాణిజ్య ప్రకటనల ప్రొద్బలం లేకుండా పత్రిక నడపడం సాధ్యమా.. ఆ విషయంలో టి జెఎసి నేతలు

ఎలాంటి ప్లాన్ సిద్ధంగా చేసుకున్నారనేది పత్రిక మార్కెట్ లోకి వచ్చాకే తెలుస్తుంది.