కాంగ్రెస్ వాణిని వినిపించేందుకు తెలంగాణలో పార్టీకి అనుబంధంగా పత్రికను ప్రారంభించాలని టీ పీసీసీ నేతలు నిర్ణయించారు.
పత్రిక ఒకటున్న పదివేల సైన్యం అనే తత్వాన్ని రాజకీయ నేతలు ఎప్పుడో గ్రహించారు. పత్రికలే సోపానాలుగా పవర్ కు దగ్గరైన పార్టీలు ఎన్నో ఉన్నాయి. కానీ, ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలా ఆలస్యంగా గ్రహించినట్లున్నారు.
60 ఏళ్ల తెలంగాణ పోరాటంలో కాంగ్రెస్ పాత్ర తక్కువేమీ కాదు. అన్ని వైపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా తెగించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. కానీ, ఏం లాభం తెలంగాణ ప్రజల సుదీర్ఘ కలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ కు ఏమాత్రం దక్కకుండా పోయింది.
http://telugu.asianetnews.tv/telangana/congress-poses-ten-questions-to-kcr
తెలంగాణ ఇచ్చింది... తెచ్చింది మేమే అని ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఎంత ఊదరగొట్టినా అది ప్రజల చెవికి ఎక్కనే లేదు.ఎన్నికల వేళ తెలంగాణ తెచ్చిన ఘనత తామేదనని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసినా ఓటర్లందరూ ‘కారు’ వైపే వెళ్లారు.
పోనీ, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా టీఆర్ఎస్ వైఫల్యాలపై పెద్ద స్థాయిలో ఉద్యమిస్తున్నా ఆ ఫలితం కనిపించడం లేదు. ప్రజల నుంచి స్పందన రావడం లేదు. దీంతో ఈ పరిస్థితిపై లోతుగా చర్చించిన టీ కాంగ్రెస్ నేతలు సొంతంగా పత్రిక లేకపోవడం వల్లే తమ కార్యక్రమాలు ప్రజల వద్దకు చేరడం లేదని తేల్చారు.
రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానైనా మద్దతిచ్చే పత్రికలనున్నాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీకి తప్ప.
తెలుగు దేశం పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మీడియాను ఎలా మేనేజ్ చేయాలో, తనకు అనుకూలంగా పత్రికల్లో వార్తలు ఏలా రాయించాలో ఆ పార్టీకి తెలిసినంతగా దేశంలో ఏ పార్టీకి తెలియదు.
ముఖ్యంగా ఆ రెండు పత్రికలు ఎప్పటి నుంచో టీడీపీకి అనుకూలంగా తమ విధేయత చాటుకుంటూనే ఉన్నాయన్నది బహిరంగ రహస్యం.
ఇక టీఆర్ఎస్ పార్టీ కూడా తక్కువేమీ కాదు ఉద్యమ సమయం నుంచే పత్రిక, టీవీ చానెల్ తో పార్టీని పటిష్టం చేసుకుంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇంగ్లీష్ లో కూడా పత్రిక తీసుకొచ్చింది. త్వరలో ఉర్దూలోని మరో పత్రికను తీసుకరాబోతోంది.
కమ్యూనిస్టు పార్టీలకు మొదటి నుంచి పత్రికలే కంచుకోటలు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు సొంతంగా పత్రికలున్నాయి.
ఎటొచ్చి తెలంగాణ లో కాంగ్రెస్ వాయిస్ వినిపించే పత్రికే లేకుండా పోయింది. అందుకే ఈ ఖాళీని పూరించి జనాల్లో వెళ్లాలంటే ఓ పత్రిక పెట్టాలని నిర్ణయించారు ఇక్కడి కాంగ్రెస్ నేతలు.
ఇందులో భాగంగా ప్రస్తుతం సీపీఐ కి అనుబంధంగా పనిచేస్తున్న మన తెలంగాణ దినపత్రికను లీజుకు తీసుకోవాలని నిర్ణయించారట. త్వరలో మాజీ కేంద్ర మంత్రి చిదంబరం చేతులుమీదుగా ఈ పత్రికను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం ఈ పత్రికైనా ‘చేతి’ రాత మారుస్తుందో చూడాలి.
కాగా, ఇటీవల పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మూలనపడ్డ ఓ న్యూస్ చానెళ్ ను లీజుకు తీసుకున్నారు. అయితే పార్టీ పరంగా కాకుండా ఆయన వ్యక్తిగత ప్రచారానికే ఇది ఉపయోగించే అవకాశం ఉంది.
