జగిత్యాల: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి గ్లోబరీనా సంస్థను ఇంటర్ బోర్డుకు అంటకట్టిందే కేటీఆర్ అంటూ ఆరోపించారు. 

ఇప్పుడు తనకు తెలియదని కేటీఆర్ మాట్లాడుతున్నారంటూ విరచుకుపడ్డారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆత్మహత్యలు చేసుకున్న 24 మంది విద్యార్థుల ఉసురు తగులుతుందని వ్యాఖ్యానించారు. 

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రభుత్వానికి కనువిప్పు కావాలంటే కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగుర వేయాలని పిలుపునిచ్చారు జీవన్ రెడ్డి. మూడు నెలలు గడుస్తున్నా సర్పంచులకు చెక్ పవర్ లేదని విమర్శించారు. పారిశుధ్య కార్మికులకు వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారని ఇదీ టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరని ఎద్దేవా చేశారు. 

ఓడిపోతామనే భయంతోనే పార్లమెంట్ ఎన్నికల తీర్పుకు ముందే ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. రైతు బంధు పథకంతో రైతు కన్నీళ్లు తుడవలేరని, వారికి గిట్టుబాటు ధర కల్పించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.