హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీ లాబీలో హరీశ్‌తో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ మార్పుపై వంటి అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. 

గత కొద్దిరోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటానని ఒకసారి ఉండలేనని మరోసారి చెప్తూ నానా హంగామా చేస్తున్నారు.

బీజేపీలో చేరడం ఖాయమైపోయిందనుకుంటున్న తరుణంలో మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతానన్నారు. అనంతరం అనేక మార్లు కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు కూడా చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
 
అయితే తాజాగా టీఆర్ఎస్ కీలకనేత, మంత్రి హరీశ్‌తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. కోమటిరెడ్డి కారెక్కుతారనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి.  

ఇంతకీ కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా లేక బీజేపీలో చేరతారా....? బీజేపీలో చేరే వ్యూహం బెడిసి కొట్టడంతో టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారా ....? ఇవే ప్రశ్నలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హల్ చల్ చేస్తున్నాయి.