చేవేళ్ల నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో తనకు మెజారిటీ వచ్చిందన్నారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలకు మంగళవారం గాంధీభవన్‌లో కార్యకర్తలు సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొండా మాట్లాడుతూ.. ఎన్నికల్లో తనను ఓడించాలని కేటీఆర్‌ చేవేళ్లపైనే ఫోకస్ పెట్టారని, పోలీసులు, అధికారులను పార్టీ కార్యకర్తల్లా ఉపయోగించుకున్నారని ఆయన ఆరోపించారు.

ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని.. అయితే ప్రజలు దీనిని గమనించారని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. కేంద్రంలో ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా తెలుగు రాష్ట్రాల నుంచే మొదలైందని.. వచ్చే ఎన్నికల్లో సైతం ఇక్కడి నుంచే కాంగ్రెస్ ప్రభంజనం మొదలవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ నేతలు ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని... కానీ చిన్న చిన్న పనులు కూడా చేయలేదని విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు.