పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘‘గజ’’ తుఫాను ప్రభావం తెలంగాణపైనా పడింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలి గాలుల తీవ్రత అధికమైంది. హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది.

ఉదయం ఎనిమిది గంటలైనా సూర్యుడు కనిపించడం లేదు. మరోవైపు చలి పెరగడంతో  స్వైన్ ఫ్లూ వేగంగా విస్తరిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తులు మరణించగా.. మరో 9 మంది స్వైన్ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు..

వీరిలో ముగ్గురికి వ్యాధి నిర్థరాణ కావడంతో ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాంధీలో మరణించిన ఇద్దరితో కలిపి హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది.

బహిరంగ ప్రదేశాల్లో జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు జనం అప్రమత్తంగా ఉండటం, కాళ్లు, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని.. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, ముక్కు కారటం, తల, గొంతు నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.