Asianet News TeluguAsianet News Telugu

పెద్దలకొస్తే రోగం పేదలకొస్తే భారమా ?

తెలంగాణ డిప్యూటీ సీఎం దంపతులకు స్వైన్ ఫ్లూ సోకినట్లు తెలియడంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది.  

 

swine flu alert in telangana

 

హైదరాబాద్ లో ఈ రోజు స్వైన్ ఫ్లూ వ్యాధిపై సైరన్ మోగింది. గత కొన్నాళ్లుగా నగరాన్ని స్వైన్ ఫ్లూ వణికిస్తున్న విషయం తెలిసిందే. అయినా ఇన్నాళ్లు పట్టించుకోని సర్కారు ఇప్పుడు మాత్రం ఉరుకులు పరుగులు పెడుతోంది.

 

నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాకుండా ప్రైవేటు హాస్పిటల్స్ లో కూడా పదుల సంఖ్యలో స్వైన్ ఫ్లూ అనుమానిత కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఒక్క తెలంగాణలోనే 100 మందికి స్వైన్‌ఫ్లూ సోకినట్టు వివిధ ఆస్పత్రుల్లో నమోదైన రికార్డులను బట్టి తెలుస్తోంది.

 

అయినా దీనిపై స్పందించని అధికార యంత్రాంగం ఈ రోజు మాత్రం వ్యాధి తీవ్రతపై పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. స్వయంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వైన్ ఫ్లూ పై సమీక్ష నిర్వహించారు.

 

గత కొన్నాళ్ల నుంచి వందల మంది వ్యాధిబారిన పడినా స్పందించని అధికార యంత్రాగం ఈ రోజే ఎందుకంతగా రియాక్ట్ అవుతుందో తెలుసా...

తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ దంపతులకు స్వైన్‌ఫ్లూ సోకినట్లు వార్తలొచ్చాయి.అందువల్లే అధికారులు తెగ హడావిడి చేస్తున్నారు.


స్వైన్‌ఫ్లూ వ్యాధి పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ విస్తృత ప్రచారం నిర్వహించాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ ఆదేశించారు. స్వైన్‌ఫ్లూపై తన కార్యాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష కూడా జరిపారు.

 

వైద్యులు అప్రమత్తంగా ఉంటూ మందుల కొరత లేకుండా చూడాలని సూచించారు. ఐపీఎంతో పాటు నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలోనూ వ్యాధి నిర్థారణ పరీక్షలు ప్రారంభించాలని ఆదేశాలు జారీచేశారు. నిమ్స్‌ సూపరింటెండెంట్‌ను నోడల్‌ అధికారిగా, గాంధీ ఆస్పత్రిని నోడల్‌ ఆస్పత్రిగా ప్రకటిస్తూ చికిత్సలు అందించాలని స్పష్టంచేశారు. స్వైన్‌ఫ్లూపై ప్రతి రోజూ సమీక్షించి పరీక్షలు నిర్వహించాలని, ఉచితంగా మందులు పంపిణీ చేయాలని సూచించారు.

 

ఇలా ఒక్క రోజుతో స్వైన్ ఫ్లూ పై పెద్ద యుద్దమే ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు గాంధీ ఆస్పత్రిలోనే  ఆరుగురు ఈ వ్యాధి వల్ల మృతిచెందారు.  మరో 12 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

 

కొన్నాళ్లుగా వ్యాధి విజృంభిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం వ్యాధిబారిన పడితేనే కానీ అధికారుల్లో చలనం రాలేదా అని ప్రశ్నిస్తున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios