టీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్. బీజేపీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో ఒక్కనాడైనా ఉద్యమం కోసం పోరాడని వారికి పదవులు ఇస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.

ఉద్యమకారులను ఎందుకు పక్కన పెడుతున్నారో అర్ధం కావడం లేదని స్వామిగౌడ్ చెప్పారు. ఎలాంటి పదవుల కోసం తాను బీజేపీలో చేరలేదని ఆయన స్పష్టం చేశారు.

ఉద్యమకారులకు గౌరవం ఇస్తుందని ఆశించే బీజేపీలో చేరానని స్వామిగౌడ్ వెల్లడించారు. రెండేళ్లుగా సీఎంను కలవాలని చూస్తున్నా తనకు అపాయింట్‌మెంట్ దక్కలేదని ఆయన ఆరోపించారు.

Also Read:కేసీఆర్‌కు బిగ్ షాక్: బీజేపీలో చేరిన స్వామి గౌడ్

దాదాపు 200 సార్లు అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించానని స్వామిగౌడ్ వివరించారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అనేది చాలా ముఖ్యమన్నారు. కాగా,  కొద్దిరోజుల క్రితం బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లతో భేటీ అయ్యారు.

దీంతో ఆయన బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం జరిగింది. మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చినప్పటికీ స్వామిగౌడ్ మౌనంగానే ఉన్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు నమ్మకస్తుడిగా ఉన్న స్వామిగౌడ్ బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.