సిద్ధిపేట పట్టణాన్ని పరిశుభ్రంగా వుంచేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం స్వచ్చ సిద్దిపేట పేరిట 2కే రన్ నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షణ్.. స్వచ్ఛ రన్ లో భాగంగా పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద జెండా ఊపి 2కే రన్ ను ప్రారంభించారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు.  

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... స్వచ్ఛ సర్వేక్షణ్ లో పాల్గొని సిద్దిపేట మున్సిపాలిటీని దేశంలోని సుందర నగరాల సరసన నిలుపుదామని ప్రజలకు  పిలుపునిచ్చారు. రన్ ఫర్ స్వచ్ సిద్దిపేట కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని... పట్టణ యువత స్ఫూర్తి, సిటీజన్స్ చైతన్యం బాగుందన్నారు. మన సిద్దిపేట మన బాధ్యతగా పట్టణంలోని ప్రతి పౌరుడు స్వచ్ఛతకై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

''స్వచ్ఛ సిద్ధిపేటకు స్వచ్ఛ సర్వేక్షణ్ లో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలి. ఇవాళ 2కే రన్ కార్యక్రమంలో స్వచ్ఛ స్ఫూర్తిని చాటారు. ఇదే స్ఫూర్తితో భారతాన అగ్రస్థానంలో నిలిచేలా కృషి చేయాలి. సిద్దిపేట అంటే శుద్దిపేటగా మార్చుదాం. స్వచ్ఛ సర్వేక్షణ్ ఫీడ్ బ్యాక్ ను మరింత స్కోర్ పెంచి దేశంలో ప్రథమ స్థానంలో నిలపాలి.  సిద్ధిపేట ఉత్తమ పట్టణంగా అభివృద్ధి చెందాలని ప్రయత్నం చేస్తున్నాం'' అన్నారు.

''మన ఇంటితో పాటు గల్లీ, పట్టణం పరిశుభ్రంగా ఉండాలన్నదే నా తాపాత్రయం. ఇందు కోసం ప్రతి పౌరుడు బాధ్యతతో తన కర్తవ్యాన్ని నిర్వర్తించేలా మెదలాలి.  ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ సిద్ధిపేట పట్టణం పరిశుభ్రమైన పట్టణం సాధ్యం'' అని హరీశ్ రావు పేర్కొన్నారు.

స్వచ్ఛ 2కే రన్ లో పాల్గొని విజేతలుగా నిలిచిన పోలీసు శిక్షణ పొందుతున్న జీ.సాయికృష్ణ, జీ.కిషోర్, డి. శ్రీకాంత్, ఫుట్ బాల్ క్రీడాకారులు ఈశ్వర్, చైతన్య, రమ్య, మౌనిక, కృతిక తదితరులకు మంత్రి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. 

స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సిద్ధిపేట సాధించే లక్ష్యంతో కృషి చేస్తానని బోర్డుపై మంత్రి హరీశ్ రావు మొదటి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, రఘోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఏఏంసీ చైర్మన్ పాల సాయిరాం, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే పట్టణ వాసులు, పట్టణ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛ సిద్దిపేటకై సంతకం చేసి ఫోన్ నంబర్ రాసి ప్రమాణం చేశారు.