వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ భర్త తన భార్యను గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. భార్య అక్రమసంబంధం పెట్టుకుందన్న అనుమానం ఉన్న వ్యక్తిమీద కూడా దాడి చేశాడు.
ఆసిఫాబాద్ : కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ధాబా గ్రామంలో శనివారం రాత్రి ఓ వ్యక్తి అనుమానంతో తన భార్యను హత్య చేశాడు.
సంగీత (25)మీద.. ఆమె భర్త మారుతి (30) ఇంట్లోనే గొడ్డలితో దాడి చేసినట్లు వాంకిడి పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మారుతి గొడ్డలి తీసుకుని ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె మెడ, భుజంపై గాయాలయ్యాయి.
గొడవ విన్న ఇరుగుపొరుగు వారు సంగీతను రక్షించేందుకు దంపతుల ఇంటికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న వారిలో ఎం పోచు అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతనితో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని మారుతి ఆరోపించాడు.
టెక్సాస్ షాపింగ్ మాల్ కాల్పుల్లో తెలుగు విద్యార్థిని మృతి..
మారుతి పోచుపై కూడా దాడి చేసి గాయపరిచాడు. దీంతో అతనికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సంగీతకు పోచుతో అక్రమ సంబంధం ఉందని మారుతీ అనుమానిస్తున్నాడని, అదే హత్యకు కారణమని వాంకిడి ఇన్‌స్పెక్టర్ బి శ్రీనివాస్ తెలిపారు. ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే హైదరాబాదులోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మే1న చోటుచేసుకుంది. తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి భార్య బంధువులతో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దీంతో రెచ్చిపోయిన ఆ భర్త.. భార్య బంధువుల మీద కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో వారు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించి సీఐ పవన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
హైదరాబాద్ జీడిమెట్లలోని గాజుల రామారావు వల్లభాయ్ నగర్ కు చెందిన విజయకుమార్ కు.. మెదక్ జిల్లా చేగుంట మండలం నార్సింగికి చెందిన స్వప్నతో 16 ఏళ్ల క్రితం పెద్దలు పెళ్లి చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. గత మూడేళ్లుగా విజయకుమార్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్యను కూడా అప్పటినుంచి దూరంగా పెడుతూ వస్తున్నాడు. అంతేకాదు విడాకులు ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేస్తున్నాడు.
దీనికి తోడు ఇంటికి రావడం కూడా కొద్ది నెలలుగా మానేశాడు. బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరైనా ఫోన్లు చేసినా స్పందించడం లేదు.దీంతో విసిగిపోయిన భార్య స్వప్న.. తన అక్కలు శ్యామల, మంజుల, బాబాయ్ శ్రీనివాస్ లతో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. శనివారం రాత్రి భర్త విజయ్ కుమార్.. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో ఉన్నాడన్న విషయం తెలుసుకొని వీరు అక్కడికి వెళ్లారు. విజయకుమార్ ని పట్టుకుని నిలదీశారు.
దీంతో వీరి మధ్య గొడవ జరిగింది. కోపానికి వచ్చిన విజయ్ కుమార్.. భార్య స్వప్నను కొట్టడం ప్రారంభించాడు. అది చూసిన స్వప్న బాబాయ్ శ్రీనివాస్ అడ్డుకోవడానికి ప్రయత్నించగా అతని మీద కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో శ్రీనివాస్ మెడ, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే అతనితో వచ్చిన మిగతా వాళ్ళు అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ దాడి నేపథ్యంలో ఆదివారం నాడు స్వప్న జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
