హైదరాబాద్ శివార్లలోని దమ్మాయిగూడలో గురువారం పాఠశాల నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైన నాలుగో తరగతి చదువుతున్న బాలిక మృతదేహం శుక్రవారం ఉదయం సమీపంలో చెరువులో తేలియాడుతూ కనిపించిన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. 

హైదరాబాద్ శివార్లలోని దమ్మాయిగూడలో గురువారం పాఠశాల నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైన నాలుగో తరగతి చదువుతున్న బాలిక మృతదేహం శుక్రవారం ఉదయం సమీపంలో చెరువులో తేలియాడుతూ కనిపించిన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో మిస్టరీ మాత్రం వీడటం లేదు. కేసు దర్యాప్తు కోసం 10 బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. సైంటిఫిక్ ఎవిడెన్స్‌తో పాటు, హ్యుమన్ ఇంటెలిజెన్స్‌తో విచారణ కొనసాగిస్తున్నారు. చిన్నారి ఇందు తల్లిదండ్రుల ఫోన్లను జవహర్‌నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు చెప్పారు. 

ఈ రోజు చిన్నారి ఇందు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. అయితే ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక, ఇందుకు బయటి నుంచి ఎలాంటి గాయాలు కాలేదని.. మరణానికి గల కారణాలను నిర్ధారించేందుకు పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్టుగా పోలీసు వర్గాలు తెలిపాయి. 

అసలేం జరిగిందంటే.. 
గురువారం ఉదయం 8.45 గంటల ప్రాంతంలో ఇందును, ఆమె ఇద్దరు సోదరీమణులను వారి తండ్రి జె నరేష్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో వదిలిపెట్టిన వెంటనే బాలిక కనిపించకుండా పోయింది. ఇందు చివరిసారిగా ఆమె స్నేహితులకు కనిపించిందని పోలీసులు తెలిపారు. అయితే ఇందు పాఠశాలలో కనిపించకపోవడం.. బ్యాగ్ మాత్రం ఉండటంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్టుగా ఓ ఉపాధ్యాయుడు తెలిపారు. దీంతో స్కూల్ సిబ్బంది, ఇందు తల్లిదండ్రులు.. ఆమె ఆచూకీ కోసం వెతికారు. ఎలాంటి ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఇందు కోసం గాలింపు చేపట్టారు. 

ఇందు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే ఇందు స్కూల్ నుంచి బయటకు వెళ్లే సమయంలో సమీపంలోని పార్క్‌లో ఆడటానికి వస్తారా అని స్నేహితులను అడిగిందని.. అయితే ఉపాధ్యాయులు ఏమైనా అంటారేమోనన్న భయంతో వారు అందుకు నిరాకరించరని పాఠశాలకు చెందిన ఓ టీచర్ చెప్పారు. ఇందు చదువుతున్న స్కూల్ ఎదురుగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ‌ని పోలీసులు పరిశీలించారు. పాఠశాల నుంచి మసీదు మీదుగా దమ్మాయిగూడ చెరువు వైపు ఇందు ఒంటరిగా వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ పోలీసులు గాలింపు చేపట్టారు. బాలిక జాడను గుర్తించేందుకు స్నిఫర్ డాగ్స్‌ను తీసుకొచ్చిన లాభం లేకుండా పోయింది. అయితే శుక్రవారం ఇందు దమ్మాయిగూడ చెరువులో ఇందు మృతదేహం తేలియాడుతూ కనిపించింది. అయితే సాధారణంగా తాగుబోతుల సంచరించే ప్రాంతంలోని చెరువులో చిన్నారి శవమై కనిపించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చెరువు దగ్గర ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో.. పోలీసుల ఇతర మార్గాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

చిన్నారి ఇందు మృతితో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలను దారి తీసింది. ఇందు మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఇందు కోసం వెతుకులాటలో పోలీసులు ఆలస్యం చేశారని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గురువారం రోజున పోలీసులు నీటిలో వెతకలేదని.. వారు కేవలం సీసీటీవీ ఫుటేజ్‌పై మాత్రమే దృష్టి పెట్టారని ఆరోపించారు. మృతదేహం నీటిపై తేలిన తర్వాతే పోలీసులు ఆమెను కనుగొన్నారని చెప్పారు. ఇక, ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించిన తరువాత పోలీసులు ఇందు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.