హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పలు రాజకీయ పార్టీల నుండి ఫిర్యాదులు రావడంతో సూర్యాపేట ఎస్పీ వెంకటేశ్వర్లును బదిలీ చేసింది. ఈ మేరకు బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు ఎస్పీ పై బదిలీ వేటేసింది. 


సూర్యాపేట: సూర్యాపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లుపై ఎన్నికల సంఘం బదిలీ వేటేసింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలను పురస్కరించుకొని వెంకటేశ్వర్లుపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు ఈసీ బదిలీ చేసింది.

కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గురువారం నాడు కలిసి హుజూర్‌నగర్ లో చోటు చేసుకొన్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు.

సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు భూమన్నను అరెస్ట్ చేయడంతో పాటు పలు విషయాలపై వెంకటేశ్వర్లుపై విపక్షాలు ఆరోపణలు చేశాయి. దీంతో వెంకటేశ్వర్లును శుక్రవారం నాడు ఈసీ బదిలీ చేసింది. వెంకటేశ్వర్లు స్థానంలో భూపాలపల్లికి చెందిన భాస్కరన్ ను నియమించింది. వెంకటేశ్వర్లును హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేసింది ఈసీ.

ఎన్నికల విధులను వెంకటేశ్వర్లుకు కేటాయించవద్దని కూడ ఈసీ పోలీసు శాఖను ఆదేశించింది. ఈ నెల 21వ తేదీన హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు భూమన్న వస్తే ఆయనను అరెస్ట్ చేశారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన సర్పంచ్ లను పోలీసులు అడ్డుకొన్నారని విపక్షాలు విమర్శలు చేశాయి. 

హుజూర్‌నగర్ లో చోటు చేసుకొన్న పరిణామాలపై లక్ష్మణ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై ఈసీ శుక్రవారం నాడు స్పందించింది. వెంకటేశ్వర్లును బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకొంది.

వెంకటేశ్వర్లు స్థానికుడని... ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడ ఆరోపణలు చేసింది.ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 

మరో వైపు నియోజకవర్గంలో డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా సురేష్ కుమార్ ను ఈసీ నియమించింది.