Asianet News TeluguAsianet News Telugu

భార్య మేనమామను కారుతో ఢీకొట్టి, 2 కిమీ ఈడ్చుకెళ్లి చంపేశాడు

సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ఓ వ్యక్తి తాగిన మత్తులో తన భార్య మేనమామను కారుతో ఢీకొట్టి 2 కిలోమీటర్ల ఈడ్చుకెళ్లి చంపేశాడు. పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపైకి కూడా కారును పోనిచ్చే ప్రయత్నం చేశాడు.

Suryapet: Man kills wife's relative colliding with car
Author
Nereducharla, First Published Feb 22, 2020, 6:59 AM IST

సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ఓ వ్యక్తి అత్యంత దారుణంగా హత్యకు పాల్పడ్డాడు. తన భార్య మేనమామను అత్యంత దారుణంగా హత్య చేశాడు. భార్యతో తరుచుగా గొడవ పడుతూ పుట్టింటికి పంపించేవాడు. కొంతకాలానికి వచ్చి మళ్లీ తీసుకుని వెళ్లేవాడు. కానీ ఈసారి భార్య రానని పట్టుబట్టి కూర్చుంది. దాంతో తన మూడేళ్ల కూతురిని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లాలని అనుకున్నాడు. 

అందుకు అడ్డుపడిన తన భార్య మేనమామను కారుతో ఢీకొట్టాాడు. దాంతో అతను బానెట్ పై పడ్డాడు. రెండు కిలోమీటర్ల మేర బానెట్ పైనే ఈడ్చుకెళ్లి అతన్ని చంపేశాడు. నేరేడుచర్లకు చెందిన లారీ డ్రైవర్ గుం శంకర్ (31) తన అక్క యాదమ్మ కూతురు శ్రీదేవిని ఐదేళ్ల క్రితం గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన సుజయ్ కు ఇచ్చి వివాహం చేశారు. 

పెళ్లయిన తర్వాత అదనపు కట్నం కోసం భార్యను సుజయ్ వేధిస్తూ వచ్చాడు. భార్యను పుట్టింటికి పంపించడం, తిరిగి తీసుకుని వెళ్లడం అతనికి ఆనవాయితీగా మారింది. ఈ క్రమంలోనే ఈ నెల 18వ తేదీన భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. శ్రీదేవి హైదరాబాదులోని తన సోదరి రాజేశ్వరి ఇంటికి వెళ్లింది. సుజయ్ 20వ తేదీన నేరేడుచర్లకు వచ్చాడు 

తన భార్యతో మాట్లాడాలని అత్తింటివారితో గొడవ పడ్డాడు. దాంతో శుక్రవారంనాడు శ్రీదేవిని నేరేడుచర్లకు పిలిపించారు. అయితే, భర్తతో తాను కాపురానికి వెళ్లేది లేదని ఆమె భీష్మించుకుంది. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న సుజయ్ తన కూతురు శాన్వితను కారులో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. 

అయితే, శంకర్ కారుకు అడ్డుపడ్డాడు. అయితే, సుజయ్ శంకర్ ను కారుతో ఢీకొట్టి, వేగం పెంచాడు. దాంతో శంకర్ ఎగిరి కారు బానెట్ పై పడ్డాడు. బానెట్ పై శంకర్ ఉండగానే దాదాపు 2 కిలోమీటర్ల మేర జాన్ పాడ్ రోడ్డు వరకు పోనిచ్చాడు. అయితే, శంకర్ బానెట్ పై నుంచి ఎగిరి కింద పడ్డాడు. సుజయ్ కారును ఆపకుండా అతనిపై నుంచి పోనిచ్చాడు. అలాగే ఈడ్చుకెళ్లాడు. 

శంకర్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మరణించాడు. శంకర్ భార్య శైలజ ఫిర్యాదు మేరకు నేరేడుచర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పిడుగురాళ్ల వైపు వెళ్తున్ సుజయ్ పాలకవీడు పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సుజయ్ వారిపై నుంచి కూడా కారును పోనిచ్చేందుకు ప్రయత్నించాడు. పోలీసులు తృటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios