చంద్రబాబు పంథాపై సర్వే సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

Survey Satyanarayana reveals the links between TDP and Congress
Highlights

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో అనుసరించబోయే భవిష్యత్తు వైఖరిపై తెలంగాణ కాంగ్రెసు నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో అనుసరించబోయే భవిష్యత్తు వైఖరిపై తెలంగాణ కాంగ్రెసు నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమతో కలిసి వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. 

హైదరాబాదులోని బోడుప్పల్ లో జరిగిన కాంగ్రెసు కార్యకర్తల సమావేశంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తు టీడీపి, కాంగ్రెసు మధ్య సంబంధాలపై ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీలు కలిసిపోయేలా ఉన్నాయని ఆయన అన్నారు. 

తనకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ముందుగానే కేంద్ర మంత్రి పదవి రిజర్వేషన్‌ చేసి ఉంచినట్లు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి అని కూడా ఆయన అన్నారు. 

చంద్రబాబు కాంగ్రెసుకు దగ్గరవుతున్నారనే ప్రచారం గత కొంత కాలంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయని అంటున్నారు. పార్లమెంటులో కాంగ్రెసు ఎంపీలు చేసిన ప్రసంగాల వల్ల రాష్ట్రంలో ఆ పార్టీపై ప్రజలకు ఉన్న ద్వేషం తగ్గిందని ఆయన అన్నారు.

loader