రాజాసింగ్ కు సుప్రీంకోర్టు నోటీసులు..నవంబర్ 1లోగా వివరణకు ఆదేశం...
పీడీ యాక్ట్ కింద అరెస్టై జైల్లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2018 ఎన్నికల అఫిడవిట్లో రాజాసింగ్ క్రిమినల్ కేసులు పొందుపరచకపోవడంపై వివరణ ఇవ్వాలని కోరింది.
న్యూఢిల్లీ : ఎమ్మెల్యే రాజాసింగ్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2018 ఎన్నికల అఫిడవిట్లో రాజాసింగ్ క్రిమినల్ కేసులు పొందుపరచలేదంటూ టిఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం సీజేఐ జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ రవీంద్రభట్, జస్టిస్ జేబీ పార్దీవాలా ధర్మాసనం విచారించింది. వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి.. నవంబర్ 1లోగా సమాధానం ఇవ్వాలని చెప్పింది.
ఇదిలా ఉండగా, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఆగస్టులో పీడీ యాక్ట్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిమీద హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ప్రివెంటివ్ డిటెన్షన్ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై పీడీయాక్ట్ నమోదవడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. రాజాసింగ్ పై పెద్ద సంఖ్యలో కేసులు ఉన్నాయని, రౌడీ షీట్ కూడా ఉందని పోలీసులు వెల్లడించారు. ఆగస్టు 25న రాజాసింగ్ ని ఆయన కార్యాలయం వద్ద అరెస్టు చేసిన పోలీసులు ఆ సమయంలో పిడియాక్ట్ కు సంబంధించిన నోటీసులు అందించినట్లు తెలుస్తోంది.
రేపు పీడీ యాక్ట్ అడ్వైజరీ కమిటీ భేటీ: పాల్గొననున్న రాజాసింగ్
ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. తరచూ నేరాలకు పాల్పడేవారికి, పేరుమోసిన నేరస్తులను ఒక సంవత్సరం పాటు జైలులో ఉంచడానికి పోలీసులు పీడీ యాక్ట్ ను అమలు చేస్తారు. నేరస్తులు సమాజానికి ముప్పుగా పరిణమిస్తున్నారు అనే కారణంతో ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు. అయితే పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్ కు సంబంధించిన వివరాలను పీడీ యాక్ట్ బోర్డు ముందు సమర్పించాల్సి ఉంటుంది.
అలాగే ప్రతిమూడు నెలలకు ఒకసారి పీడీ యాక్ట్ సమావేశం జరుగుతుంది. ఆ బోర్డు పీడీయాక్ట్ ను నిర్ధారిస్తే ఏడాదిపాటు జైలులో ఉండే అవకాశం ఉంటుంది. మరో మరోవైపు పీడీయాక్ట్ ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే 2004 నుంచి ఇప్పటివరకు రాజాసింగ్ పై 101 పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. రాజాసింగ్ 18 కమ్యూనల్ కేసులు ఉన్నాయని చెప్పారు. మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజాసింగ్ పై గతంలోనే రౌడీషీట్లు ఉందన్నారు. గత కేసుల ఆధారంగా రాజాసింగ్ పై పిడి యాక్ట్ నమోదు చేసినట్టు గా చెప్పారు.
రాజాసింగ్ తరచు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారన్నారు. మత ఘర్షణలు చోటు చేసుకునేలా రాజా సింగ్ ప్రసంగాలు ఉన్నాయని అన్నారు. కాగా, రాజాసింగ్ పై పెట్టిన పీడీయాక్ట్ చట్టాన్ని కొట్టివేయాలని కోరుతూ ఆయన భార్య ఉషా బాయి దాఖలు చేసిన పిటిషన్ పై సెప్టెంబర్ 6న తెలంగాణా హైకోర్టు విచారణ జరిగింది ఈ సందర్భంగా రాజాసింగ్ పీడీయాక్ట్ అమలు చేయడంపై వివరణ ఇవ్వాలని న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.