తెలంగాణలో రేషన్ కార్డుల ఏరివేత పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.  

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల ఏరివేతపై సుప్రీంకోర్టు (supreme court) ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో 19 లక్షల రేషన్ కార్డులను (cancellation of ration cards) ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై బుధవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. సరైన పరిశీలన లేకుండా లక్షలాది రేషన్ కార్డులు ఎలా తొలగిస్తారని ప్రశ్నించింది. 2016లో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా మళ్లీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని (telangana govt) ఆదేశించింది. రేషన్ కార్డుల రద్దుకు ఎటువంటి ప్రమాణాలు ఆచరించారో అఫిడవిట్‌ సమర్పించాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా కంప్యూటర్‌లో పొందుపర్చిన వివరాలతో రేషన్ కార్డులను ఎలా రద్దు చేస్తారని అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.