హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జ్యూడీషీయల్ కమిటీ సోమవారం నాడు హైద్రాబాద్‌కు చేరుకొంది. హైకోర్టు వేదికగా ఈ కమిటీ విచారణ ప్రారంభించనుంది.

Also read:దిశ కేసు: సోదరితో చివరిగా మాట్లాడింది ఆమెనే, కీలక ఆధారాలు

గత ఏడాది నవంబర్ 24వ తేదీన  షాద్‌నగర్‌కు సమీపంలోని తొండుపల్లి  సర్వీసు రోడ్డుపై దిశపై నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత  ఆమెను చటాన్‌పల్లి అండర్ పాస్ బ్రిడ్జి కింద పెట్రోల్ పోసి దగ్ధం చేశారు.

గత ఏడాడి డిసెంబర్ 6వ తేదీన చటాన్ పల్లి అండర్ పాస్ వద్ద  దిశ నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.  ఈ ఎన్‌కౌంటర్‌పై  సామాజిక కార్యకర్తలు సజయ తదితరులు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ విషయంలో   సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన జ్యూడీషీయల్ కమిటీ సోమవారం నాడు హైద్రాబాద్‌కు చేరుకొంది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై రాచకొండ పోలీసులు ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటికే విచారణను చేసింది.ఎన్‌కౌంటర్‌పై సిట్ రిపోర్టును జ్యూడీషీయల్ కమిటీ కి అందించారు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్.

తెలంగాణ హైకోర్టులోని సీ బ్లాక్‌ వేదికగా జ్యూడీషీయల్ కమిటీ విచారణ చేయనుంది. నిందితుల పోస్టుమార్టం, రీ పోస్టుమార్టం నివేదికలను  జ్యూడీషీయల్ కమిటీ  పరిశీలించనుంది.నిందితుల ఎన్‌కౌంటర్‌పై సామాజిక కార్యకర్తలు కోర్టును ఆశ్రయించడంతో రీపోస్టుమార్టం చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైకోర్టు ఆదేశం మేరకు నిందితుల  మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించారు.

సిట్ నుండి వివరాలను సేకరించనుంది జ్యూడీషీయల్ కమిటీ.  దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు ముందు చోటు చేసుకొన్న పరిణామాలను కూడ కమిటీ పరిశీలించే అవకాశం లేకపోలేదు.