అయోధ్యపై సుప్రీం తీర్పు... అసదుద్దీన్ ఓవైసీ అసంతృప్తి
ఈ పోస్టు పెట్టడానికి ఓ గంట ముందు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు చేసిన ట్వీట్ రీ ట్వీట్ చేశారు. కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ బోర్డు కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య వివాదానికి నేడు పులిస్టాప్ పడింది. వివాదాస్పద భూమిని రామమందిర నిర్మాణానికే కేటాయించారు. మసీద్ కోసం ప్రత్యేకంగా ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు చెప్పారు. కాగా... సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ట్విట్టర్ లో ఫోటోని ఓవైసీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ‘ సుప్రీం బట్ నాట్ ఇన్ఫాలిబుల్’ అని ఉంది. సుప్రీం కోర్టు పై రాసిన ఓ పుస్తకం ఫోటోని ఆయన ట్వీట్ చేశారు. పుస్తకం పేరుకి ఉన్నసుప్రీం బట్ నాట్ ఇన్ఫాలిబుల్ కాగా దాని అర్థం అత్యున్నతమైన కానీ.. అమోఘమైనది కాదు అని. తన అసంతృప్తిని ఈ ఫోటో ద్వారా ఆయన తెలియజేశారు.
ఈ పోస్టు పెట్టడానికి ఓ గంట ముందు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు చేసిన ట్వీట్ రీ ట్వీట్ చేశారు. కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ బోర్డు కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఆ ట్వీట్ లో ‘‘ మా అంచనాలకు విరుద్దంగా తీర్పు ఉంది. మా వైఖరిని నిరూపించుకోవడానికి మేము చాలా ఆధారాలు, సాక్ష్యాలు నిరూపించాము. మా న్యాయ కమిటీ తీర్పును సమీక్షిస్తుంది. కూల్చివేసిన వాటిని పునరుద్ధరించడానికి మా బాధ్యతను నెరవేర్చడానికి మేము శాయశక్తులా ప్రయత్నించాము, ”అని ట్వీట్ చేసింది. కాగా... ఆ ట్వీట్ ని ఓవైసీ రీ ట్వీట్ చేశారు.
కాగా...యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై తీర్పును ఈరోజు వెలువరించనున్న విషయాన్నీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిన్న సాయంత్రం ప్రకటించింది. శనివారం ఉదయం 10:30 గంటలకు అయోధ్య భూ వివాదంపై ఐదుగురు న్యాయమూర్తుతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తుది తీర్పును వెలువరించేందుకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆసీనమయ్యింది.
కాగా తీర్పు వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే అప్రమత్తత ప్రకటించిన విషయం తెలిసిందే. ముందస్తు జాగ్రత్తగా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. యూపీ వ్యాప్తంగా 40 వేలకు పైగా సిబ్బందిని మోహరించింది. తీర్పు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇదివరకే హైఅలర్ట్ ప్రకటించింది. స్కూళ్లకు కాలేజీలకు కూడా సెలవులను ప్రకటించేసారు.
అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన అంశం అయిన ఈ రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన తీర్పు వెలువడిన అనంతరం నెలకొనే పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది.
కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయం కావడం వల్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు గురువారంమే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
కాగా తీర్పుపై ఎవరూ వివాదస్పద రీతిలో బహిరంగ ప్రకటన చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు సూచించారు. సున్నితమైన అంశం గనుక ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని తెలిపారు. ఈ మేరకు ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని తీర్పుపై స్పందించిన విషయం తెలిసిందే.
సోషల్ మీడియా యూజర్స్ కు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇది వరకే స్పష్టమైన హెచ్చరికలు జారీచేసారు. తీర్పు వెలువడిన తరువాత తీర్పుకు వ్యతిరేకంగా లేదా సానుకూలంగా ఎటువంటి రెచ్చగొట్టే సోషల్ మీడియా పోస్టులు చేసినా, వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు.