యాంకర్ శ్రీరెడ్డికి పెరుగుతున్న మద్దతు

First Published 9, Apr 2018, 1:55 PM IST
support pouring in for Srireddy while maa distances from the anchor
Highlights
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మీద ఫిర్యాదు

ఫిల్మ్ ఛాంబర్ వద్ద అర్ధ నగ్న నిరసన తెలిపిన యాంకర్ శ్రీరెడ్డికి ఇప్పుడిప్పుడే పలు సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. ఒకవైపు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ శ్రీరెడ్డిని మా నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఆమెతో కలిసి ఎవరైనా నటీ నటులు నటిస్తే అసోసియేషన్ లో వాళ్ల సభ్యత్వం కూడా రద్దు చేస్తామని హెచ్చరించింది.

 ఈనేపథ్యంలో శ్రీరెడ్డి ఆందోళనకు మద్దతుదారులు పెరుగుతున్నారు. తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసింది. శ్రీరెడ్డి బతుకుదెరువు కోల్పోయేలా చేసిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తెలంగాణ యూత్ ఫోర్స్ ప్రధాన కార్యదర్శి బింగి రాములు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిలకు ఆదేశాలివ్వాలని ఫిర్యాదులో కోరారు.

900 మంది సినిమా ఆర్టిస్టులకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అల్టిమేటం లాంటి ఫత్వా జారీ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు పిటిషనర్. మా తీసుకున్న నిర్ణయం శ్రీరెడ్డి బతుకుదెరువును నాశనం చేయడమే అని ఆందోళన వ్యక్తం చేశారు. తన సమస్యల మీద, తన కష్టాల మీద మా కు నోటీసు ఇచ్చి తన సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించిన శ్రీరెడ్డిని ఇలా వెలి వేయడం దారుణమని పిటిషన్ లో పేర్కొన్నారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారి మీద శ్రీరెడ్డి ఫిర్యాదు చేస్తే.. పట్టించుకోకుండా, కనీసం ఆమెను పిలిచి సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయకుండా ఏకపక్షంగా ఆమెపై వేటు వేయడం, ఫత్వా జారీ చేయడం దారుణమన్నారు.

ఆమె కిరాయికి ఉంటున్న ఇంటి ఓనర్ ను కూడా మా అసోసియేషన్ పెద్దలు బెదిరించడం మరీ దారుణం అని తెలిపారు. ఆమెను ఇల్లు ఖాళీ చేయించే ప్రయత్నం చేయడం బాధాకరమని పిటిషన్ లో తెలిపారు. మరోవైపు శ్రీరెడ్డి విషయంలో సినీ స్టార్ శ్రీకాంత్ మాట్లాడిన తీరు దారుణంగా ఉందని బింగి రాములు పిటిషన్ లో పేర్కొన్నారు. తక్షణమే శ్రీరెడ్డికి న్యాయం చేసేలా తెలంగాణ సిఎస్, డిజిపిలను ఆదేశించాలని కోరారు. తెలంగాణ యూత్ ఫోర్స్ తరుపున రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో సీనియర్ అడ్వొకెట్ పొలిశెట్టి అరుణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద మానవ హక్కుల కమిషన్ ఏ రకంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

loader