మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనా వైరస్‌తో కన్నుమూయడాన్ని ఆదివాసీలు తట్టుకోలేకపోతున్నారు. కన్నీటి సంద్రమవుతున్నారు. ఇందుకు బలమైన కారణాలున్నాయి. సహజంగా ప్రజా ప్రతినిధి అనగానే... కార్లు, సెక్యూరిటీ సిబ్బంది ఇలా చాలా హంగామా ఉంటుంది. 

కానీ... సున్నం రాజయ్య ఇందుకు పూర్తి భిన్నం. సీపీఎం ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచిన ఆయన... ఎప్పుడు అసెంబ్లీకి వెళ్లినా... ఆర్టీసీ బస్సు, లేదా ఆటోలో వెళ్లేవారు. ఒక్కోసారి బైక్‌పై వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. 

ఎమ్మెల్యే అంటే కారులోనే వెళ్లాలనుకునే అభిప్రాయం ఉన్న ఈ రోజుల్లో అసలైన ఎమ్మెల్యే అంటే ప్రజలతో ఉండేవారే అని నిరూపించుకున్నారు. ఆయన వెంట ఎప్పుడూ హంగూ ఆర్భాటమూ లేదు. అసలు ఆయన్ని కొత్తవారెవరైనా చూస్తే ప్రజా ప్రతినిధి అని అస్సలు అనుకోరు. 

అంత సింపుల్‌గా, సాదాసీదాగా ఉండేవారు రాజయ్య. ((తన నియోజకవర్గం భద్రాచలంలో కూడా రాజయ్య... బైకుపైనే ఎక్కడికైనా వెళ్లేవారు. చాలా సందర్భాల్లో భద్రాచలం నుంచి హైదరాబాద్‌కి ఆర్టీసీ బస్సుల్లో వచ్చారు. 

ఇంకా గొప్ప విషయమేంటంటే... ఎమ్మెల్యేగా చేసినప్పుడు వచ్చే శాలరీలో... సగం పార్టీకి ఇచ్చేవారు. మిగతా సగం... తన ఖర్చుల కోసం వాడేవారు. ఈ రోజుల్లో ఇలాంటి నేతలు ఉన్నారంటే నమ్మడం కష్టమే. ((మూడుసార్లు భద్రాచలం ఎమ్మెల్యేగా చేసినా... రాజయ్యకు సొంత కారు లేదు. 

ఓసారి రాజయ్య సాయంత్రం వేళ ఆటోలో తెలంగాణ సెక్రటేరియట్‌కి వచ్చారు. ఆటోని లోపలికి అనుమతివ్వాలని సెక్యూరిటీని కోరారు. అందుకు సెక్యూరిటీ ఒప్పుకోలేదు. తాను ఎమ్మెల్యేని అంటూ రాజయ్య తన ఐడీ ప్రూఫ్ చూపించారు. అయినా సరే వాళ్లు నమ్మలేదు. ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ఆటోలో రావడం జరిగిందా... కుదరదు అంటూ దాదాపు 20 నిమిషాలపాటూ వాదనకు దిగారు. చివరకు మీడియా జర్నలిస్టులు... రాజయ్యను గుర్తించి... సెక్యూరిటీ సిబ్బందితో వాదించి... ఆటోతో సహా ఆయన్ని లోపలికి పంపించారు. ఈ ఘటనతో సెక్యూరిటీ సిబ్బంది వణికిపోయారు. 

తమపై రాజయ్య కంప్లైంట్ ఇస్తారేమో, ప్రభుత్వం తమను సస్పెండ్ చేస్తుందేమో అనుకున్నారు. రాజయ్య బయటకు వచ్చాక... మీడియా ఇదే విషయం అడిగింది. "భలే వాళ్లే... వాళ్లపై కేసు పెట్టి నేను సాధించేదేముంది? వాళ్ల పొట్టకొట్టడం తప్పితే" అంటూ నవ్వుతూ వెళ్లిపోయారు. 

రాజయ్య మంచి మనసును మీడియా జర్నలిస్టులు మెచ్చుకున్నారు. ఇలాంటి నేతలు అరుదుగా ఉంటారని వార్తలు ఇచ్చారు. ((తాజాగా రాజయ్యకు కరోనా లక్షణాలు కనిపించడంతో... స్వగ్రామం నుంచి విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. 

అక్కడ ట్రీట్‌మెంట్ పొందుతూ... ఆయన తుదిశ్వాస విడిచారు. సున్నం రాజయ్య మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు ఆదివాసీలు. అందర్నీ చాలా ఆప్యాయతగా పలకరించి, చాలా నిరాడంబరంగా జీవించేవారనీ.., చివరికి ఇలా కరోనా కాటుకి బలవుతారని తాము అస్సలు ఊహించలేదని వారంతా కన్నీరు పెడుతున్నారు. రాజయ్య మరణం మానవ సమాజానికీ, గిరిజన, ఆదివాసీలకు తీరనిలోటంటూ... జోహార్లు అర్పిస్తున్నారు