హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిలైనట్టు తెలియడంతో ఆ విద్యార్థఇని ఆత్మహత్య చేసుకుంది. తెలుగు సబ్జెక్టులో ఫెయిల్ అయినట్లు ఇంటర్ ఫలితాల్లో రావడంతో మనస్తాపం చెందిన ఆ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. 

ఈ వ్యవహారంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో మరణించడంతో రీ వెరిఫికేషన్ కు ప్రభుత్వం ఆదేశించింది. అయితే రీ వెరిఫికేషన్ లో ఆ విద్యార్థి పాస్ అయినట్లు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 

వివరాల్లోకి వెళ్తే  హైదరాబాద్ కోఠిలోని ప్రగతి మహావిద్యాలయలో అనామిక ఇంటర్మీడియల్ సిఈసీ మెుదటి సంవత్సరం చదువుతోంది. అయితే గత నెల ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో ఆమె ఫెయిల్ అయినట్లు వచ్చింది. 

పరీక్ష బాగారాసినప్పటికీ ఎందుకు ఫెయిల్ అయ్యిందో అర్థంకాక తీవ్ర మనస్థాపానికి గురైంది. అన్ని సబ్జక్టుల్లో పాస్ అయినప్పటికీ తెలుగు సబ్జక్టులో 20 మార్కులే రావడంతో తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

ఆంగ్లంలో 64, ఎకనామిక్స్ లో 55, సివిక్స్ లో 67, కామర్స్ లో 75 మార్కులు వచ్చాయి. కానీ తెలుగులో మాత్రం అనామికకు కేవలం 20 మార్కులే వచ్చాయి. తెలంగాణ ఇంటర్ ఫలితాల అవకతవకలపై స్పందించిన ప్రభుత్వం ఫెయిలైన విద్యార్థులందరికీ జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్ చేయాలంటూ ఆదేశించింది. 

రీ వెరిఫికేషన్ లో అనామిక పాసైనట్లు వచ్చింది. తెలుగులో ఆమె 48 మార్కులు సాధించింది. అంటే 28 మార్కులు పెరిగాయి. అనామిక పాస్ అయినట్లు ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో పేర్కొనడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. 

ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని అనామిక కుటుంబ సభ్యులు కోరుతున్నారు.  అన్యాయంగా తన చెల్లిని ఇంటర్ బోర్డ్‌ పొట్టన పెట్టుకుందని దీనిపై క్రిమినల్ కేసు పెడ్తామని అనామిక సోదరి ఉదయ హెచ్చరించారు. ఇకపోతే తెలంగాణ ఇంటర్ ఫలితాల గందరగోళంలో 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.