తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధుడు, అమరవీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు, ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు కామ్రేడ్ బూర్గుల నర్సింగరావు(89) కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న ఆయన నగరంలోని కేర్ ఆసుపత్రిలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 

నర్సింగరావు అంత్యక్రియలు నేటి మధ్యాహ్నం 12 .30 గంటలకు జూబ్లిహిల్స్ మహాప్రస్థానంలో జరిగాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలోనూ తనవంతు పాత్ర పోషించిన నర్సింగరావు మృతి పట్ల.. వారి మరణం పట్ల వామపక్ష పార్టీల నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి, డాక్టర్ కె. నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, అజీజ్ పాషా, పల్లా వెంకట రెడ్డి, కూనంనేని సాంబశివరావు, తెలంగాణ అమరవీరుల ట్రస్టు కార్యదర్శి కందిమల్ల ప్రతాపరెడ్డి, ఆరుట్ల ఫౌండేషన్ అధ్యక్షురాలు ఆరుట్ల సుశీల తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

వారి కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలిపారు. సీపీఐ సీనియర్ నేత నారాయణ మాట్లాడుతూ..  అహర్నిశలు కమ్యూనిస్ట్ ఉద్యమ పురోభివృద్ధికి కృషి చేశారన్నారు. తమకు పెద్దదిక్కుగా ఉండేవారని, వారిమరణం కమ్యూనిస్ట్, ప్రగతిశీల ఉద్యమాలకు తీరని లోటన్నారు. వారి శ్రీమతికి కూడా ఆరోగ్యం క్షీణిస్తున్నదని తెలిసిందన్నారు.