125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో కొనసాగుతున్న జాప్యం
అంబేద్కర్ ఆశయాలను స్మరించుకునేలా దేశంలో అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం నెలకొల్పాని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఏడాది దాటింది. గత ఏడాది అంబేద్కర్ 125 వర్థంతిన సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని హుస్సాన్ సాగర్ తీరాన విగ్రహ ఏర్పాటు శంకుస్థాపన కూడా చేశారు. విగ్రహ నమూనా , నిర్మాణ పనుల కోసం సబ్ కమిటీ ని కూడా ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఈ సబ్ కమిటీ ఏర్పాటైంది.
అయితే ఈ సబ్ కమిటీ ఇప్పటి వరకు విగ్రహ నమూనాకు కూడా ఇప్పటి వరకు ఆమోదం తెలపలేదు. 125 అడుగుల విగ్రహం ఏర్పాటు కోసం గతంలో సబ్ కమిటీ బృందం సిక్కిం రాష్ట్రంలో కూడా పర్యటించింది. అక్కడ రావంగ్ల లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 130 అడుగుల బుద్ధపార్క్ ను అధ్యయనం చేసింది.
అయితే ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు మళ్లీ సబ్ కమిటీ బృందం అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం అధ్యయనం చేయడానికి చైనా పర్యటనకు వెళ్లింది.
ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యుత్ , యస్.సి కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి , ఎంపీలు బాల్కసుమన్ ,పసునూరి దయాకర్ ,శాసనసభ్యులు రసమయి బాలకిషన్ ,ఆరూరీ రమేష్ ఆర్ &బి ఇంజినీరు ఇన్ చీఫ్ గణపతి రెడ్డి ,యస్.సి కార్పొరేషన్ యమ్.డి ఆనంద్ , జే.యన్.టి.యు ఆర్కిటెక్ట్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు చైనా వెళ్లి అక్కడి ఎత్తై విగ్రహాలను పరిశీలిస్తున్నారు.
కనీసం చైనా నుంచి వచ్చాక అయినా మన నేతలు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ముందుకు కదులుతారా లేదా అనేది వేచిచూడాలి.
