ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో రాత్రికి రాత్రే వెలిసిన టీఆర్ఎస్ ప్లెక్సీలు ఉద్రిక్తతకు కారణమయ్యారు. టీఆర్ఎస్ నాయకులనే కాదు ప్లెక్సీలను చూసినా నిరుద్యోగ యువత ఆగ్రహంతో ఊగిపోతున్నారు. 

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ (hyderabad) లోని ఉస్మానియా యూనివర్సిటీ (osmania university)లో ఉద్రిక్తత నెలకొంది. క్యాంపస్ ప్రాంగణంలో టీఆర్ఎస్ పార్టీ (TRS Party)కి చెందిన ప్లెక్సీలు రాత్రికి రాత్రే వెలియడం ఈ ఉద్రిక్తతకు కారణమయ్యింది. ఇప్పటికే ఆశించిన స్థాయిలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో అధికార టీఆర్ఎస్ పార్టీపై పీకలదాకా కోపంతో వున్న ఓయూ విద్యార్థులు ప్లెక్సీలను చించివేసి ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ ప్లెక్సీలకే కాదు ఆ పార్టీ నాయకులు క్యాంపస్ లో అడుగుపెట్టినా ఇదే గతి పడుతుందని నిరుద్యోగ యువత హెచ్చరించారు.

ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు (cm kcr birthday)ను పురస్కరించుకుని టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటుచేసారు. ఈ టోర్నమెంట్ ఇవాళ(శుక్రవారం) ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కొందరు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరుకావాల్సి వుంది. ఈ క్రమంలోనే వారికి స్వాగతం పలుకుతూ నిన్న(గురువారం) రాత్రి స్థానిక టీఆర్ఎస్ నాయకులు, ఓయూలోని టీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి చెందిన నాయకులు ప్లెక్సీలు ఏర్పాటుచేసారు.

అయితే ఇవాళ ఉదయం ఈ ప్లెక్సీలను చూసిన ఓయూ విద్యార్థులు ఆగ్రహంతో వాటిని చించేసి దగ్దం చేసారు. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యాంపస్ లో అడుగుపెట్టకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం సమాయత్తం అవుతున్నట్లు వివిధ విద్యార్థి సంఘాలు, విద్యార్థులు తెలిపారు. 

ఫ్లెక్సీ లను తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి నేతలు ఉద్యోగ నోటిఫికేషన్లు వేసిన తర్వాతనే ఓయూ లో అడుగుపెట్టాలని హెచ్చరించారు. అలా కాకుండా ఓయూలో అడుగుపెడితే అడ్డుకుంటామని విద్యార్థులు టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరించారు.

ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమకు ఉద్యోగాల వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న యువత చివరకు స్వరాష్ట్రంలోనూ ఉద్యోగాల రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడడం కలకలం రేపుతోంది. ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో ఎక్కడ తన కల సాకారం కాదేమోనన్న ఆందోళనతో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన నిరుద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసు ఉద్యోగం కోసం చిన్నప్పటి నుంచి పరితపించిన అతడు ఎన్సిసి లోనూ సర్టిఫికెట్ కూడా సంపాదించాడు. ఇలా రెండున్నరేళ్లుగా ఓ ప్రైవేటు సంస్థలో శిక్షణ తీసుకుంటున్న ముత్యాల సాగర్(24) మంగళవారం తెల్లవారుజామున ఖమ్మం మామిళ్లగూడెం వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

అతడి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా బయ్యారం. సోమవారం అర్ధరాత్రి రెండు గంటల 45 నిమిషాలకు అతడు మొబైల్ లోనే వాట్సాప్ స్టేటస్ ‘నోటిఫికేషన్ లేవు.. పిచ్చిలేస్తోంది. కేసీఆర్, కరోనా కారణం’ అని ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.

సాగర్ తండ్రి భద్రయ్య హమాలీ. తల్లి కళమ్మ కూలీ. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. రెండేళ్ల కిందట కూతురు సౌజన్య వివాహం చేశారు. సాగర్ చదువులో చురుగ్గా ఉండేవాడు. ఐదేళ్లుగా ఖమ్మంలోనే ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కాలేజీలో 2019లో డిగ్రీ పూర్తి చేశాడు. స్నేహితులతో కలిసి గది అద్దెకి తీసుకుని ఉంటున్నాడు. మూడు నెలల క్రితం వారు వెళ్లిపోవడంతో.. ఒక్కడే కాలం గడుపుతున్నాడు. జేబు ఖర్చులకు డబ్బు పంపే స్థోమత తల్లిదండ్రులకు లేదని.. వారికి భారం కాకూడదని ఖాళీ సమయంలో క్యాటరింగ్ పనులకు వెళ్లేవాడు.

సంక్రాంతి పండుగకు ఇంటికి వెళ్లి తిరిగి ఖమ్మం వచ్చాడు. తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత చేసుకుంటానని చెప్పాడు. గత సోమవారం రాత్రి తల్లితో ఫోన్లో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నాడు. తెల్లవారుజామున బలవన్మరణానికి పాల్పడ్డాడు.