రెగ్యులర్ వీసీ నియామకం సహా మరికొన్ని అంశాలకు సంబంధించి బాసర ట్రిపుల్ ఐటీ ఇన్‌ఛార్జ్ వీసీతో విద్యార్ధుల చర్చలు ముగిశాయి. తమ డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 24 వరకు వారు డెడ్‌లైన్ విధించారు. 

బాసర ట్రిపుల్ ఐటీలో ఇన్‌ఛార్జ్ వీసీతో విద్యార్ధుల చర్చలు ముగిశాయి. ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమైన మెస్ కాంట్రాక్టర్లను తొలగించాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు. మరికొన్ని డిమాండ్లను ఇన్‌ఛార్జ్ వీసీ ముందు వుంచారు విద్యార్ధులు. ఈ నెల 24 లోపు వీసీని నియమించాలని విద్యార్ధులు డెడ్ లైన్ పెట్టారు. లేనిపక్షంలో 25 నుంచి మళ్లీ ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

కాగా... బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని గత నెలలో వారం రోజులు పాటు క్యాంపస్‌లోనే ఆందోళన చేసిన ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విద్యార్థులతో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి‌‌ చర్చలు జరిపి.. సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. అయితే తాజాగా ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో రెండు మెస్‌లలో ఫుడ్ పాయిజన్‌ ఘటన తీవ్ర కలకలం రేపింది. వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం మరోసారి విద్యార్థుల ఆగ్రహానికి కారణమైంది. 

ALso REad:బాసర ట్రిపుల్ ఐటీ నూతన ఇంచార్జ్ వీసీగా వెంకటరమణ.. మరోసారి ఆందోళన బాట పట్టిన విద్యార్థులు..

ఈ పరిణామాల నేపథ్యంతో బాసర ట్రిపుల్ ఐటీకి ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్‌గా వెంకటరమణను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంకటరమణ ప్రస్తుతం ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో.. ట్రిఫుల్‌ ఐటీలోని వీసీ కార్యాలయంలో శనివారం రాత్రి ఇంచార్జ్ వీసీగా వెంకటరమణ బాధ్యతలు స్వీకరించారు. దీంతో ప్రస్తుతం ఇంచార్జ్ వీసీగా ఉన్న రాహుల్ బొజ్జా ఆ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. 

అయితే మరోసారి ఇంచార్జ్ వీసీనే నియమించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ వీసీని నియమించాలని డిమాండ్ చేస్తూ మరోసారి ఆందోళన బాట పట్టారు. రెగ్యులర్ వీసీ నియామకంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట ఇచ్చారని.. ఇప్పుడు మాట తప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదుట ఆందోళనకు దిగారు.