బాసర ట్రిపుల్ ఐటీకి నూతన ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్‌గా  వెంకటరమణను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే రెగ్యులర్ వీసీని నియమించాలని డిమాండ్ చేస్తూ  విద్యార్థులు మరోసారి ఆందోళన బాట పట్టారు. 

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని గత నెలలో వారం రోజులు పాటు క్యాంపస్‌లోనే ఆందోళన చేసిన ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విద్యార్థులతో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి‌‌ చర్చలు జరిపి.. సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. అయితే తాజాగా ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో రెండు మెస్‌లలో ఫుడ్ పాయిజన్‌ ఘటన తీవ్ర కలకలం రేపింది. వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం మరోసారి విద్యార్థుల ఆగ్రహానికి కారణమైంది. 

ఈ పరిణామాల నేపథ్యంతో బాసర ట్రిపుల్ ఐటీకి ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్‌గా వెంకటరమణను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంకటరమణ ప్రస్తుతం ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో.. ట్రిఫుల్‌ ఐటీలోని వీసీ కార్యాలయంలో శనివారం రాత్రి ఇంచార్జ్ వీసీగా వెంకటరమణ బాధ్యతలు స్వీకరించారు. దీంతో ప్రస్తుతం ఇంచార్జ్ వీసీగా ఉన్న రాహుల్ బొజ్జా ఆ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. 

అయితే మరోసారి ఇంచార్జ్ వీసీనే నియమించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ వీసీని నియమించాలని డిమాండ్ చేస్తూ మరోసారి ఆందోళన బాట పట్టారు. రెగ్యులర్ వీసీ నియామకంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట ఇచ్చారని.. ఇప్పుడు మాట తప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇదే విషయంపై భవిష్యత్ ఉద్యమ కార్యచరణను కూడా సిద్దం చేసుకుంటున్నారు. అయితే మరోవైపు ఇంచార్జ్‌ వీసీగా బాధ్యతలు చేపట్టిన వెంకటరమణ‌తో విద్యార్థులు చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది.

ఇక, బాసర ట్రిపుల్ ఐటీ శుక్రవారం ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పీయూసీ-1, పీయూసీ-2 హాస్టళ్లలో మధ్యాహ్న భోజనం తర్వాత వాంతులు, విరేచనాలు అయ్యాయి. మధ్యాహ్నం ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌ వడ్డించారని.. అది తిన్న చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. కొందరు స్పృహ తప్పిపడిపోయారు. దీంతో అప్రమత్తమైన ట్రిపుల్ ఐటీ అధికారులు క్యాంపస్‌లోని ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌లో అస్వస్థతకు గురైన విద్యార్థులకు చికిత్స అందించారు. స్పృహతప్పి పడిపోయిన వారిని నిజామాబాద్‌లోని ఆసుపత్రులకు తరలించారు.

ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకారం.. ఇన్స్టిట్యూట్‌లోని మూడు మెస్‌లలో రెండింటిలో భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ రెండింటినీ ఒకే కాంట్రాక్టర్ నిర్వహిస్తున్నారు. రెండు హాస్టళ్లలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌ వడ్డించారు. మరో పక్క ఫుడ్‌ పాయిజన్‌ గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని వారి పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. 

మొత్తం 150 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని.. వారిలో 20 మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన తర్వాత డిశ్చార్జ్ చేశారని కలెక్టర్ ముష్రఫ్ అలీ ఫరూఖీ తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మెస్ కాంట్రాక్టర్లపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ క్రమంలోనే మెస్ కాంట్రాక్ట్ సంస్థలపై ట్రిపుల్ ఐటీ యజమాన్యం బాసర పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు విద్యార్థులు తిన్న ఆహారానికి సంబంధించిన నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. 

మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ ఎదుట నిరసనకు దిగిన బీజేవైఎం, వైఎస్‌ఆర్‌టీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని విడుదల చేశారు. విద్యార్థులను కలిసేందుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డిని కూడా పోలీసులు తిప్పి పంపారు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి నిరసనగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.