Asianet News TeluguAsianet News Telugu

కాలేజీ టూ ఎన్నికలు.. గ్రేటర్ బరిలో విద్యార్థులు

సాధారణంగా చదువు అయిపోగానే వెంటనే ఏ కంపెనీలో ఉద్యోగం సాధించాలా అని అందరూ చూస్తుంటారు. కానీ వీరు అలా చదువు అయిపోగానే ఇలా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. 

Students in GHMC Elections
Author
Hyderabad, First Published Dec 1, 2020, 11:21 AM IST

గ్రేటర్ ఎన్నికల సమరం మొదలైంది. ఎన్నికల ప్రచారం ముగిసింది. అభ్యర్థుల భవిష్యత్తు తేలే సమయం దగ్గరపడింది. ఇప్పటికే ఓటర్లు ఒకరి తర్వాత మరొకరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా.. ఈ ఎన్నికల్లో కొందరు విద్యార్థులు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకోనున్నారు. ఈ గ్రేటర్ ఎన్నికల్లో కాలేజీ విద్యను అలా పూర్తి చేసుకున్న కొందరు యువత పోటీ పడుతుండటం గమనార్హం.

సాధారణంగా చదువు అయిపోగానే వెంటనే ఏ కంపెనీలో ఉద్యోగం సాధించాలా అని అందరూ చూస్తుంటారు. కానీ వీరు అలా చదువు అయిపోగానే ఇలా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. కొందరు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులుగా, మరికొందరు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇలాంటి వారు మొత్తం 21 మంది ఉన్నారు. వీరి వయస్సు 21 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యే ఉంది.  

మల్కాజిగిరి నియోజకవర్గంలోని గౌతమ్‌నగర్‌ డివిజన్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా తపస్విని యాదవ్‌ పోటీ చేస్తున్నారు. ఎన్నికల క్షేత్రంలోకి దిగిన తర్వాత తన మాటల తూటాలతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తపస్విని ఇటీవల శ్రీనిధి ఇంజనీరింగ్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. జియాగూడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా అభిషేక్‌ చౌగ్లే ఎన్నికల బరిలో నిలిచారు.

ఇటీవల బీకామ్‌ పూర్తి చేసి ఎంబీఏ చేయాలనే ఆలోచనతో ఐసెట్‌లో మెరుగైన ర్యాంకు సాధించారు. కానీ రాజకీయాలపై తనకున్న మక్కువతో కాంగ్రెస్‌ అభ్యర్థిగా జియాగూడ నుంచి బరిలోకి దిగారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని బౌద్ధనగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం ఇద్దరు విద్యార్థినులు ఎదురుచూశారు. ఎన్నికల్లో నామినేషన్లను వేసి బీఫామ్‌ కోసం ప్రయత్నించగా, దక్కకపోవడంతో టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థులుగా ఎన్‌.వరలక్ష్మి, గుండు జ్యోత్స్నప్రియ పోటీ చేసున్నారు. జ్యోత్స్న ప్రియ ఇటీవల డిగ్రీ పూర్తి చేయగా, ఎన్‌.వరలక్ష్మి బీటెక్‌ పూర్తి చేశారు. సనత్‌నగర్‌ డివిజన్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పెరుమాళ్ల వైష్ణవి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వైష్ణవి ప్రస్తుతం బీబీఏ ఫైనలియర్‌ చదువుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios