హన్మకొండ జిల్లాలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో విషాదం.. ట్రాక్టర్ కింద పడి బాలుడి మృతి..
హన్మకొండ జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది.
హన్మకొండ జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యాదినోత్సవం జరుపుతున్నారు. అయితే హన్మకొండ జిల్లాలో విద్యాదినోత్సవం సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. వీధికుక్కలు వెంటపడటంతో తప్పించుకునే క్రమంలో ట్రాక్టర్ కింద పడి మృతిచెందారు. మృతిచెందిన విద్యార్థిని 6వ తరగతి విద్యార్థి ఇనుగాల ధనుష్‌గా గుర్తించారు.
వివరాలు.. విద్యాదినోత్సవం సందర్భంగా కమలాపూర్ మండలం మర్పెల్లిగూడెంలో విద్యార్థులతో ర్యాలీ తీశారు. ర్యాలీ తీస్తుండగా ధనుష్ పక్కనే ఉన్న కిరాణం దుకాణంలోకి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకునేందుకు వెళ్లాడు. అయితే బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని వస్తుండగా.. వీధి కుక్కలు వెంటపడ్డాయి. వాటినుంచి తప్పించుకునే ప్రయత్నంలో ధనుష్ ట్రాక్టర్ కింద పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ధనుష్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Also Read: మణికొండలోని ప్లే స్కూల్ అగ్ని ప్రమాదం.. ఆందోళనతో స్కూల్ వద్దకు చిన్నారుల తల్లిదండ్రులు..
ఈ ఘటనతో ధనుష్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. స్కూల్‌కు వెళ్లిన ధనుష్ ఇలా విగతజీవిగా మారడంతో అతడి తల్లిదండ్రులు జయపాల్, స్వప్న కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.