నిజామాబాద్ జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ముఠా చేతిలో మోసపోయిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాదులోని ఓ ముఠా అతన్ని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చింది.
నిజామాబాద్: నగ్నంగా ఉన్న యువతులతో మాట్లాడించి, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాగే ముఠా వేధింపులకు ఓ విద్యార్థి బలయ్యాడు. ఆ ముఠా వేధింపులు భరించలేక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు (22) హైదరాబాదులోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ప్రొఫెషనల్ కోర్సు చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతని ఫోన్ కు ఓ మెసేజ్ వచ్చింది. తాను ఒంటరి మహిళను అని, మీతో చాట్ చేయాలని అనుకుంటున్నానని ఆ మెసేజ్ వచ్చింది.
దానికి యువకుడు స్పందించి, తనకు మెసేజ్ వచ్చిన నెంబర్ కు ఫోన్ చేశాడు. అవతలి వైపు నుంచి ఓ యువతి రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది. ఆ తర్వాత వీడియో కాల్ చేసి నగ్నంగా కనిపిస్తూ చాటింగ్ చేసింది. తనకు నగ్నంగా చూడడం ఇష్టమని యువకుడికి ప్రేరేపించింది. ఆ దృశ్యాలను రికార్డు చేసింది.
ఆ తర్వాతి నుంచి యువకుడికి చుక్కలు చూపిస్తూ వచ్చింది. తనకు డబ్బులు పంపాలంటూ యువకుడిని వేధిస్తూ వచ్చింది. యువకుడు స్పందించకపోవడంతో వీడియోలు యూట్యూబ్ లో పెడుతానంటూ బెదిరించింది. ముఠా సభ్యులతో కలిసి ఆమె బెదిరింపులకు పాల్పడింది.
తన వద్ద ఉన్న రూ.24 వేలు వారి ఖాతాకు యువకుడు పంపించాడు. అయినా ముఠా వేధింపులు ఆగలేదు. ఇంకా డబ్బులు కావాలంటూ వేధిస్తూ వచ్చారు. దీంతో ఇటీవల అతను గ్రామానికి వెళ్లాడు. మర్నాడు తెల్లవారు జామున పొలవం వద్ద పురుగుల మందు తాగాడు. అతన్ని మొదట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి, ఆ తర్వాత సికింద్రాబాదులోని కార్పోరేట్ ఆస్పత్రికి తరలించారు మంగళవారం రాత్రి ఆ యువకుుడ మరణించాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
