హైదరాబాద్ లో ఓ ఐపిఎస్ అధికారి భార్యపై హత్యాయత్నం జరిగింది.  బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్కులో వాకింగ్ కి వెళ్లిన సమయంలో ఆమెపై దాడి జరిగింది. ఓ దుండగుడు కర్రతో ఆమె తలపై కొట్టి చంపడానికి ప్రయత్నించాడు. అయితే అక్కడే వాకింగ్ చేస్తున్న కొందరు ఆమెను కాపాడారు.

వివరాల్లోకి వెళితే హైదరాబాద్ ప్రశాసన్ నగర్ కు చెందిన ఐపిఎస్ అధికారి దుర్గా ప్రసాద్ భార్య సుజాత నిన్న సాయంత్రం కేబీఆర్ పార్కులో వాకింగ్ చేయడానికని వెళ్లింది. అయితే ఆమె వాకింగ్ చేస్తుండగా గౌని వెంకటరమణ అనే దుండగుడు ఆమెను అనుకరించాడు. దగ్గర్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించి తనతో తెచ్చుకున్న కర్రతో సుజాతపై దాడికి దిగాడు. తలపై బలంగా బాదడంతో ఆమె గట్టిగా అరిచి స్పృహ కోల్పోయింది.

ఆమె కేకు విన్న కొందరు అక్కడికి వచ్చే సరికి వెంకటరమణ పారిపోయే ప్రయత్నం చేశాడు. వారు అతన్ని సెక్యూరిటీ సిబ్బంది సాయంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే ఇతడు గత 20 రోజులుగా రెక్కీ నిర్వహించి ఈమెపై దాడిచేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇతడిపై కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై విచారిస్తున్నారు. బాధితురాలి భర్త పోలీస్ ఆఫీసర్ కావడంతో అతడిపై కోపంతో ఈ దాడి జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

ప్రస్తుతం దాడిలో గాయపడిన బాధితురాలు అపోలో ఆస్పత్పిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.