Asianet News TeluguAsianet News Telugu

ఇంకెంతకాలం ఉస్మానియాపై పగ సాధిస్తారు?

  • నాన్ బోర్డర్స్ పేరుతో వేధిస్తున్నారు
  • హాస్టళ్ల వద్ద పోలీసు బలగాల మొహరింపు
  • హాస్టళ్లు ఖాళీ చేయించేందుకు బెదిరింపులు
  • కానరాని విద్యార్థి ఉద్యమ నేతలు
stop punishing Osmania University urge students

ఉస్మానియా యూనివర్శిటీకి ప్రపంచ స్థాయి చరిత్ర ఉంది. ఎందరో మహానుభావులు, మేధావులు, ఉద్ధండులను అందించింది ఉస్మానియా గడ్డ. సమైక్య రాష్ట్రంలో ఉస్మానియా పట్ల చిన్నచూపు ఉండేదని  అందరూ అనుకునేవారు. బాధపడేవారు. ఎందుకంటే ఉస్మానియాలో సాగిన తెలంగాణ పోరాటం యావత్ తెలంగాణ ప్రజానీకానికి స్పూర్తినిచ్చింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఉస్మానియా పెనం మీంచి పొయిల పడ్డది. కనీసం సీమాంధ్ర పాలకులు ఉస్మానియాను అనాథగా వదిలేసిర్రు సంతోషమే కానీ నేడు సొంత పాలకులు కత్తి గట్టిర్రు. పగబట్టిర్రు. మరి కొలువుల జాతర జరిపిస్తమని ప్రామీస్ చేసిన అన్నలెటు పాయిరి అని ఓయు విద్యార్థులు గంపెడాశతో ఎదురుచూస్తున్నరు.

 

రెండు నెలల క్రితం ఉద్యోగాల కోసం ఓయు లో ఉధృతంగా ఉద్యమం సాగుతున్నది. ఆ సమయంలో ఉద్యమబాట పట్టిన విద్యార్థులు, ఆయా సంఘాల నేతలను బుజ్జగించేందుకు టీఆరెస్ ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, మేయర్ బొంతు రామ్మోహన్, బిసి కమిషన్ సభ్యులు ఆంజనేయ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ చిరుమిల్ల రాకేష్, ఇతర టీఆరెస్ నేతలు ఒక హోటల్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగాల ప్రకటనలు ఇప్పించడంతోపాటు విద్యార్థులకు అండగా ఉంటామన్నారు. ఉద్యోగాల సంగతి దేవుడెరుగు ఇప్పుడు పిడుగు లాంటి వార్త వినిపించింది ఓయు విద్యార్థులకు. హాస్టళ్లు ఖాళీ చేయండంటూ పోలీసు సేనలు హాస్టళ్ల వద్ద హల్ చల్ చేస్తున్నాయి.  ఓయూ పాలకమండలి తాజాగా నాన్ బోర్డర్లను హాస్టళ్లలో లేకుండా తరిమేస్తామని ప్రకటించింది.

 

నాన్ బోర్డర్ల పేరుతో పేద, నిరుద్యోగ విద్యార్థుల జోలికొస్తే కబర్దార్ అని హెచ్చరిస్తున్నారు నిరుద్యోగ జెఎసి ఛైర్మన్ కోటూరి మానవతరాయ్. నేడు అధికార పార్టీ ఇచ్చిన పదవుల్లో కొనసాగుతున్నవాళ్లు నిన్నమొన్నటి వరకు నాన్ బోర్డర్లుగా ఉండలేదా అని ప్రశ్నిస్తున్నారాయన. కేవలం ప్రశ్నించే గొంతుకను చిదిమేయాలన్న ప్రయత్నంతోనే ఉస్మానియాను ఖాళీ చేయించే కుట్రకు తెర తీశారని ఆరోపిస్తున్నారు. ఉస్మానియా 100 ఏళ్ల పండుగలో సిఎం నోరు పెగలకుండా చేసిన నాటి నుంచి మరింత కక్ష కట్టారని ఆరోపించారు. అందుకే నోటిఫికేషన్లు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని చెప్పారు. ఇచ్చిన నోటిఫికేషన్లు వివాదంలోకి నెట్టి టైంపాస్ చేస్తున్నారని ఆరోపించారు.

 

 తెలంగాణ ఉద్యమ కాలంలో చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 50వేల ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటనలు జారీ చేస్తామంటే నాడు విద్యార్థి నేతలు అభ్యంతరం చెప్పారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత మేమే ఉద్యోగాలు ఇచ్చుకుంటం అని కిరణ్ ను హెచ్చరిస్తూ ఉద్యమించారు. కానీ ఆనాడు నోటిఫికేషన్లు ఇచ్చి ఉంటే మాలో కొంత మందికైనా జాబ్స్ వచ్చేవి కదా? ఇప్పటివరు ఓయులో  ఉండే బాధ ఉండేది కాదుగదా అని కొందరు సీనియర్లు అంటున్నారు. ఇప్పుడు పదవుల్లో ఉన్న కొందరు విద్యార్థి నేతలు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చే జాబ్ నోటిఫికేషన్లకు అడ్డం  పడకపోతే మాకు ఎప్పుడో జాబ్స్ వచ్చేవి కదా అంటున్నారు. ఆనాడు జాబ్స్ రాకుండా చేసి ఇప్పుడేమో ఓయులో ఉంటే తరిమికొడతామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

 

మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిలో చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు. వారిలో అనేక మంది ఓయూలో నాన్ బోర్డర్లుగా కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఇంటికి పోతామంటూ ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నారు విద్యార్థులు. తెలంగాణ వచ్చింది కాబట్టి ఉద్యోగాలియ్యిరి మా జాగాలా మేం పోతాం అని అటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క దెబ్బల లక్ష కొలువులు ఇస్తనని, లక్ష కుటుంబాలు ఒకే ఒక్క దెబ్బల సెటిల్ అయిపోతాయని నమ్మబలికి కెసిఆర్ మాట ఎందుకు తప్పుతున్నారని ప్రశ్నిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios