దిశ హత్య నిందితుల ఎన్ కౌంటర్ ఘటనపై సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభమైన నేపథ్యంలో షాద్ నగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. త్రిసభ్య కమిటీ సభ్యులు దిశను దహనం చేసిన స్థలంతోపాటు నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించే అవకాశం ఉంది.

నవంబర్ 27న దిశ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసులో ప్రధాన నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులును నవంబర్ 29వ తేదీన పోలీసులు అరెస్టు చేసి అదే రోజు రాత్రి షాద్ నగర్ కు తీసుకువచ్చారు. షాద్ నగర్ కోర్టులో జడ్జి అందుబాటులో లేకపోవడంతో తహసీల్దార్ ను షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ను పిలిపించి నిందితులను 30వ తేదీన తహసీల్దార్ ఎదుట హాజరుపరిచారు.

అదేరోజు నిందితులకు తహసీల్దార్‌ 14రోజుల రిమాండ్‌ విధించారు. అయితే, నిందితులను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు డిసెంబర్‌ 2న కోర్టులో పిటీషన్‌ను దాఖలు చేశారు. కోర్టు నిందితులను డిసెంబర్‌ 3న పది రోజుల కస్టడీకి అనుమతిచ్చింది.

Also Read దిగ్భ్రాంతి కరమే, వేడుక చేసుకున్నారు: నిర్భయ వాదనల్లో దిశ ఘటన ప్రస్తావన...

 నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్న తర్వాత సీన్‌ రీకన్‌క్ష్రషన్‌ నిమిత్తం వారిని డిసెంబర్‌ 6న అర్ధరాత్రి చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు తీçసుకువచ్చారు. నిందితులు పోలీసులపై ఎదురుదాడికి దిగడంతో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు నిందితులు చనిపోయిన విషయం  విదితమే. 

ఎన్‌కౌంటర్‌ ఘటనపై సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సోమవారం హైదరాబాద్‌కు చేరుకుంది. కమిటీ షాద్‌నగర్‌కు రానున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్‌కౌంటర్‌ జరిగి 58 రోజులు గడుస్తున్నా ఘటనా స్ధలానికి ఎవరికి వెళ్లకుండా పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి వెళ్లనీయకుండా  దారి మూసేశారు. పోలీసులు ప్రత్యేంగా గుడారాన్ని ఏర్పాటు చేసుకొని బందోబస్తు నిర్వహిస్తున్నారు.